ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో ఎడతెగని చర్చ జరుగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఎం జగన్ ఎలా ఇరికించిందీ జాతీయ పత్రికలు సైతం ప్రచురించడంతో దేశ వ్యాప్తంగా జగన్ సైకో పాలనపై చర్చించుకుంటున్నారు. జనంలోనే కాదు.. మొన్నటి దాకా చంద్రబాబును దూరం పెట్టిన భారతీయ జనతాపార్టీ హై కమాండ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్‌పై దృష్టిపెట్టింది.
మొన్న ఢిల్లీకొచ్చిన ఏపీసీఎంకు చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో కేంద్ర బీజేపీ పెద్దలు తలంటి పంపారు. తమతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటమేంటన్న బీజేపీ పెద్దల ప్రశ్నలకు జగన్ నోరెళ్ల బెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తప్పు నాది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసి, కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టేందుకు సీఎం జగన్ చేసిన విఫల వ్యూహం ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో పరిణామాలపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ద్వారా ఓ నివేదికను తెప్పించుకున్నారు. ఆ నివేదికలోనూ ఈ వ్యవహారమంతా జగన్ కుట్రేనని ఓ నిర్ణయానికొచ్చేసిన కేంద్రం పెద్దలు జగన్ పై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికల వేడిని మరింత రాజేసిన ఆ సభ తర్వాత సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగిన మేథావుల సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వమే అయినప్పటికీ పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనుకూడా అమిత్ షా ఆరా తీశారు.
అసలు ఏపీలో ఏం జరుగుతోందన్న సమాచారాన్ని పలువురిని అడిగి తెలుసుకున్న అమిత్‌షా, వచ్చే ఎన్నికల్లో కేంద్రానికి అండగా ఏపీ నుంచి నిలబడే సత్తా ఎవరికుందని పలువుర్ని ప్రశ్నించారు. అరెస్ట్ తర్వాత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి మైలేజ్ పెరిగిందని ఎక్కువ మంది సభలో పాల్గొన్న వాళ్లు చెప్పడంతో అమిత్ షా ఓ నిర్ణయానికొచ్చేశారు. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్న బీజేపీ వ్యూహానికి పదునుపెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకే మద్దతు పలకటం మంచిదన్న అభిప్రాయంతో అమిత్ షా ఉన్నారని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణ రాజకీయాలపై మెయిన్ ఫోకస్ పెట్టిన అమిత్ షా మూడు ప్రధాన పార్టీల బలలాబలాలపై ఓ నివేదికను తెప్పించుకుని పరిశీలించాక కీలకమైననిర్ణయాలు తప్పవని నిర్ధారణకు వచ్చారు. ఒక్కరోజు పర్యటనలో ఆయన పాల్గొన్న ప్రతిచోటా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు రగిల్చడంతో పాటు, ప్రజలకు చేసిన అవినీతిని, కుటుంబ పాలనను ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యూహాలతో ముందుకెళితే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టగలమనిఅమిత్ షా ఆలోచన.