తెలుగు రాష్ట్రాల్లో ‘అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాల నిర్వహణకు రూ.25కోట్లు కేటాయించారు. ఏపీ సీఎం జగన్ గుంటూరు జిల్లా మాచర్లలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించడంతోపాటు ఆ కుటుంబానికి రూ.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ‘అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు ‘అమృత్ మహోత్సవ్’ నిర్వహించనుండగా తెలంగాణలోనూ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్ర్య సంబరాలు జరపనున్నారు.
పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్..
తెలంగాణ సీఎం కేసీఆర్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయజెండా ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్‌లో జాతీయజెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని వ్యాఖ్యానించారు. 384 కి.మీ. 24 రోజులపాటు గాంధీతోపాటు 70వేల మంది పాదయాత్ర చేసి సత్యాగ్రహ ధీక్షలో పాలుపంచుకున్నారన్నారు. దండి యాత్ర స్ఫూర్తితో అమృత్ మహోత్సవ్ కొనసాగుతుందని, హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినినాయుడు చేసిన త్యాగం కూడా మర్చిపోలేమన్నారు. స్వాతంత్య కల సిద్ధించి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏడాదిపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, రమణా చారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి రూ.25 కోట్లు కేటాయిస్తున్నటు ప్రకటించారు.
మాచర్లలో సీఎం జగన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మాచర్లలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించారు. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థికసాయంగా రూ.75లక్షలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు.
2005లో దండి సత్యాగ్రహానికి 75ఏళ్లు..
ఇక ‘అమృత్ మహోత్సవ్’ విషయానికి వస్తే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మార్చి 12న నిర్వహించే అంశానికి వస్తే.. 1930లో మార్చి నెల 12న ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా దండి యాత్ర మొదలైంది. అదే ఏడాది ఏప్రిల్ 6వరకు ఈ యాత్ర సాగింది. ఆ యాత్రల్లో పాల్గొన్నవారిలో దాదాపు 60వేల మంది అరెస్టయ్యారు. అలా అరెస్టైన వారిలో ఎర్నేని సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు తెలుగువారూ ఉన్నారు. 2005లో దండి సత్యాగ్రహ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని ప్రముఖులైన సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లు పాదయాత్ర చేపట్టారు. సోనియాగాంధీ సబర్మతి ఆశ్రమం వద్ద పాదయాత్ర ప్రారంభించగా ప్రధాని మన్మోహన్ సింగ్ దండిలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 16ఏళ్ల తరువాత దేశ స్వాతంత్ర్య కల సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా మళ్లీ అదే తేదీన ‘అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.
Also Read : టీపీసీసీపై కొత్త ఫార్ములా.. పార్టీని నిలబెట్టుకునేలా