తెలంగాణలో టీపీపీసీ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జిల్లాల వారీగా నాయకుల అభిప్రాయం తీసుకున్న పార్టీ ఇంకా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఎవరికి వారు తమ నాయకుడికే టీపీసీసీ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటేనే పార్టీకి మంచిదనే అభిప్రాయం పార్టీ కేడర్‌లో ఉంది. ఒకరికి పదవి ఇస్తే..మరికొరు పార్టీని వీడే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంతోపాటు, ఇప్పుడు రాంగ్‌స్టెప్ తీసుకుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందన్న అంచనాతో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోందని చెప్పవచ్చు. టీపీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు, గీతారెడ్డి తదితరుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే, ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా బయట ప్రచారం మాత్రమే. ఈ నేతలు ఇటీవలే ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోనియాగాంధీని కలవగా, రక్షణ శాఖ సబ్ కమిటీలో సభ్యులైనందున ఆ మీటింగ్‌కి రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో రేవంత్‌రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఫార్ములాలు ఇవే..
ఇదే అంశంపై తాజాగా మరికొన్ని పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం జరగకుండా అందరితో మాట్లాడి టీపీసీసీ అధ్యక్ష ఎంపిక జరగనుంది. అందులో భాగంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. పార్టీ 2+2+1 ఫార్ములాని అమలు చేయనుందనే చర్చ నడుస్తోంది. సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఇందులో భాగంగా కనిపిస్తోంది. రెండేళ్లపాటు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, మరో వర్గానికి చెందిన నేత పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిర్ణీత కాలం ప్రకారం ఎన్నికలు జరిగితేనే వర్తించనుంది. జమిలి ఎన్నికలు లేదా ముందస్తు ఎన్నికలు వస్తే.. మళ్లీ అప్పటి పరిస్థితి ప్రకారం నిర్ణయం తీసుకునే విధంగా కమిటీ ఏర్పాటు కానుంది. ఈ క్రమంలోనే పీసీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగిస్తే..పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు ఏంటనే అంశంపై నేతలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రేవంత్, కొమటిరెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా పాదయాత్ర, జిల్లాల వారీగా 2021 నుంచి టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై భారీ సభలు నిర్వహించడం లాంటి ప్లాన్‌లు కామన్‌గా చెప్పారట. ఇదే సమయంలో ఆర్థిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.
Must Read ;- కాంగ్రెస్‌ను గట్టెక్కించే మొనగాడెవరో.. టీపీసీసీపై తీవ్ర కసరత్తు
ఫిర్యాదులకు పాయింట్లు..
టీపీసీసీ విషయంలో పోటీ పడుతున్న వారిపై పలు కేసులు, ఫిర్యాదులకూ పాయింట్ల విధానాన్ని పార్టీ అమలు చేస్తోందని నాయకులు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డిపై ప్రధానమైన ఆరోపణ ఓటుకు నోటు కేసు కాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మైనస్ పాయింట్ ఆయన తమ్ముడు, ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీకి వెళ్తానని చెప్పడం, ఆయన ఫోన్‌కాల్స్ బయటకు రావడం లాంటి విషయాలు కూడా పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక అంశాల విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సంబంధీకులపై ఆధారపడే అవకాశం ఉందని కూడా అధిష్టానానికి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇతరుల అంశానికి వస్తే.. సామాజిక న్యాయం తెరపైకి తెస్తే.. తెలంగాణలో మెజార్టీ ఓటర్లు ఉన్న వర్గానికి చెందిన వ్యక్తికి అప్పజెప్పడం, పార్టీ తరఫున ఉమ్మడిగా ఆర్థికంగా సహకరించడం లాంటి అంశాన్ని కూడా పార్టీ ఆలోచిస్తోందని నాయకులు చెబుతున్నారు. బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడితే అధిష్టానం వద్ద మైనస్ పాయింట్లు పడతాయన్న సమాచారం రావడంతో వారం రోజులుగా ఒకరిద్దరు మినహా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా మాట్లాకపోవడం కూడా గమనించాల్సిన విషయమే.
సీఎం అభ్యర్థి వేరు..
ఆశావహులకు కేంద్ర కమిటీలో స్థానం కల్పించడం, టీపీసీసీతో సమాన ప్రాధాన్యం ఉండేలా పదవి ఇవ్వడం లాంటి అంశాలూ పార్టీ ముందున్నాయి. అంటే..టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చినంత మాత్రాన.. రానున్న కాలంలో ఆయనే సీఎం అభ్యర్థి అనే అభిప్రాయం రాకుండా పార్టీ ఈ అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంతా కలసి పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా పనిచేయడం, సామర్థ్యాన్ని బట్టి అప్పుడు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం లాంటి అంశాలను పార్టీ తెరపైకి తెచ్చినట్లు సమాచారం. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాగూర్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.
తీవ్రమైన లాబీయింగ్‌లు..
టీపీసీసీ విషయంలో పలువురు నేతలు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే జాతీయ నాయకత్వ ఎంపిక విషయంలో సోనియాగాంధీ బిజీగా ఉన్నందున.. అభిప్రాయాలను మెయిల్ ద్వారా తెలపాలని పార్టీ కోరిందని, ఆ సమాచారం ఆధారంగా చర్చించదగిన అంశమై ఉంటే పార్టీ తప్పకుండా పిలుస్తుందని సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు నేతలు ఏపీతో పాటు కర్ణాటకకు చెందిన పార్టీల లీడర్ల ద్వారా కూడా అధిష్టానం వద్ద లాబీయింగ్‌లు చేస్తున్నట్లు సమాచారం.మొత్తం మీద వీలైనంతవరకు ఆశావహులందరినీ ఒప్పించి టీపీసీసీ ఎంపిక జరుగుతుందని, అయినప్పటికీ పార్టీని వీడేవారు ఉంటే వీడవచ్చనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్లు గెలుస్తోంది
Also Read ;- ఫైర్ బ్రాండ్‌ని కెలికిన ‘పేర్ని’.. పరువు తీస్తున్న ఫ్యాన్స్