ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం గుళ్ల చుట్టూ తిరుగుతుంది. విగ్రహాల విధ్వంసం గురించి ఒకవైపు విచారణ జరుగుతుంటే.. మరోవైపు రాజకీయ పార్టీలు మరో పార్టీ నేతలను దుయ్యపడుతున్నారు. ఇక్కడ చిత్రమేమిటంటే.. అధికారం చేతిలో ఉండి.. దుండగుల్ని పట్టుకోవడం మానేసి.. ప్రతి పక్ష నేతలపై ఆరోపణలు చేస్తూ అధికార పార్టీ విమర్శనా బాణాలు ఎక్కుపెట్టడం. రాష్ట్రంలోని విధ్వంసాలన్నింటికీ కారణం చంద్రబాబేనని విమర్శలు గుప్పించారు నెల్లూరు మంత్రివర్యులు అనిల్ యాదవ్.
‘రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలకు కారణం చంద్రబాబు. విజయవాడలో 40 గుళ్లను కూల్చింది ఎవరు? క్షుద్రపూజలు చేసిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎవరు? విగ్రహాలు కూల్చడం.. వాటిని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడం.. వాటిని షేర్ చేయడం.. ఇలాంటివి చేసి ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడో జరిగిన పాస్టర్ ప్రవీణ్‌ది ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల వివరాలు చూస్తే.. రాష్ర్టంలో గుళ్లను కూల్చింది ఎక్కువ శాతం తెలుగుదేశం వాళ్లే ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలు చేయగలిగిన వ్యక్తి.. అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి కేవలం చంద్రబాబు తప్ప ఇంకెవరూ లేరు. జగన్ మోహన్ రెడ్డికి అన్ని మతాల పట్ల విశ్వాసం ఉంది. దేవుడంటే భక్తి ఉంది. ప్రజలంటే మమకారం ఉంది. అందుకే సంక్షేమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 80 లక్షలకుపైగా సంక్షేమ పనులు చేయించారు. పార్టీలకు, మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తుంటే.. ఓర్వలేక ఇలాంటి పనులు చేసి.. తిరిగి ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.’