రోడ్డుమీద ఓ మహిళ ఒడిలో కూర్చుని.. గట్టిగా వాటేసుకున్న ఓ చిన్నారి.. ఏదో దెయ్యాన్ని చూసి భయపడిపోయినట్లుగా పెద్దగా ఏడుస్తోంది ఎందుకని?
ఆమె ఎవరో.. ఏం దారుణాలు చేసిందో ఏమో.. అలా వ్యానులో పడేసి.. పొర్లించి పొర్లించి, ఒకవైపు ఆమె దుస్తులు ఊడిపోతున్నా సరే.. వ్యానులోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకని?
ఒక్కొక్క ఆడపడుచు.. అలా ఆర్తారావాలతో విలపిస్తూ ఉంటే. అలా నలుగురైదుగురు తలోవైపునా ఒడిసిపట్టుకుని.. అలా ఒక మూటలాగా మోసి.. జీపుల్లో కుక్కడానికి ఆరాటపడుతున్నారు ఎందుకని?
ఇద్దరు కలిసి అలా ఒక మహిళను కాళ్లు చేతులు చెరోవైపు పట్టుకుని లాగుతూ.. దాదాపుగా మీద పడినట్టుగా.. ఆమె అంతు తేల్చేయాలన్నంత కర్కశంగా ఈడుస్తున్నారు ఎందుకని?
ఆమెను అలా ఇద్దరు చెరో జబ్బ పట్టుకుని.. బరబర ఈడ్చుకెళుతున్నారు ఎందుకు?
అలా.. అందరూ చుట్టుముట్టి.. అంత కర్కశంగా.. ఆమెను లాగిలాగి పడేస్తున్నారు ఎందుకు?
గుంటూరు రోడ్లు శనివారం అమానుష కృత్యాలకి, ఖాకీల కరాళ నృత్యానికి వేదికలు అయ్యాయి. ఆందోళన చేస్తున్న వారిపట్ల పోలీసులు అత్యంత హేయంగా ప్రవర్తించారు. పశువులను ట్రీట్ చేసినట్లు చేశారు. ఎందుకింత కక్ష కట్టినట్టుగా, పగబట్టినట్టుగా పోలీసులు ప్రవర్తించారు.
ప్రజా ఉద్యమాలను అణచివేయడం అనేది ప్రభుత్వాలు తమ ప్రాధమిక బాధ్యతగా భావిస్తున్నాయా? తమ పాలనకు వ్యతిరేకంగా ఎవ్వరు గళమెత్తినా సరే ఆ పీక నొక్కేయాలని ఆరాటపడుతున్నాయా? అందుకోసం పోలీసు యంత్రంగాన్ని ఒక ఉపకరణంగా, టూల్ లాగా వాడుకుంటున్నాయా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనదని చెప్పుకుంటాం. ప్రజలే ప్రభుత్వానికి సర్వాధికారులు అని భుజాలు చరుచుకుంటాం. టెక్నికల్‌గానే కాగితం మీద నిర్వచనాల రూపంలో అలా కనిపించాల్సిందే తప్ప.. అవన్నీ డొల్లమాటలే! ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీరు నచ్చకపోతే అధికారంలోంచి దించేసే అధికారం ప్రజలకు ఎటూ లేదు.. కనీసం నిరసనలు వ్యక్తం చేయడానికి కూడా స్వేచ్ఛ లేదా?
ఇలాంటి వందల వేల అనుమానాలు శనివారం నాడు గుంటూరులో పోలీసుల తీరును గమనించిన వారికి కనిపిస్తాయి.
వారు ఒప్పుకున్న తప్పే కదా..
అమరావతి రాజధానిగా వద్దు.. మూడు రాజధానులే కావాలి.. అంటూ అమరావతిలో దీక్షలు చేేసిన కొందరిని.. అమరావతికి అనుకూలంగా దీక్షలు చేస్తున్న రైతులు ‘ఎందుకిలా చేస్తు’న్నారని అడిగారు. దాన్ని అడ్డుకోవడం కింద పరిగణించి పోలీసులు కేసు పెట్టారు. అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కేసు పెట్టింది కూడా ఎస్సీల మీదే. మొత్తం ఏడుగురి మీద కేసు పెడితే.. అందులో అయిదుగురు ఎస్సీలు, ఇద్దరు బీసీలు (యాదవ, గౌడ కులాలకు చెందినవారు). వీరంతా రైతులు. వీరిని గుంటూరు జైలుకు తరలించే క్రమంలో, చేతులకు బేడీలు వేసి మరీ పోలీసులు తీసుకువెళ్లారు. రైతులు కడుపులు మండాయి. రాష్ట్రమంతా గగ్గోలైపోయింది. వారు చేసిన పనిలో నేరం ఎంత ఉన్నదో, క్షోభ ఎంత ఉన్నదో అందరికీ తెలుసు. కేసులు పెట్టినా సరే.. అవి రాజకీయ ప్రేరేపితం.. అలాతప్ప మరోలా ఎలా అవుతాయని వారు సర్దుకోవచ్చు. జైళ్లకు వెళ్లడానికి కూడా వారు సిద్ధంగానే ఉండవచ్చు.. కానీ.. కాడిపట్టి మడక దున్నే, పదిమందికి అన్నం పెట్టడంలో జీవిత సాఫల్యతను ఆస్వాదించే అన్నదాతల చేతులకు బేడీలు వేయడం దావానలంలా రాజుకుంది. తప్పును పోలీసు శాఖ గుర్తించి. ఆ రైతులకు బేడీలు వేసిన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
సదరు సస్పెన్షన్ తో వారు చేతులు దులుపుకున్నారు గానీ… ఆ చర్య ద్వారా చేసింది తప్పే అని వారు అచ్చంగా ఒప్పుకున్నట్టే అయింది. తప్పు జరిగింది.. ఆ తప్పును పోలీసులు కూడా పరోక్షంగా ఒప్పుకున్నారు.. సస్పెన్షన్లతో చేతులు దులుపుకోవాలనుకున్నారు.
కానీ ఆ చర్యతో రైతుల కడుపు మంట చల్లారిపోలేదు. వారి మంటకు విపక్ష పార్టీలన్నీ కూడా దన్నుగా నిలిచాయి. శనివారం నాడు గుంటూరు జైల్ భరో ఉద్యమానికి విపక్షాలు పిలుపు ఇచ్చాయి. తెలుగుదేశం, వామపక్షాలు, అమరావతి జేఏసీ అందరూ క్రియాశీల భూమిక తీసుకున్నారు.
ఈ ఉద్యమ పిలుపు ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఇనుపపాదాలతో దానిని అణచి వేయాలని అనుకుంది.
తమకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను ప్రభుత్వాలు ఎప్పుడూ అణచివేయాలనే అనుకుంటాయి. అలాంటి ఉత్సాహంలో వారికి మొట్టమొదటగా కనిపించే మార్గం.. ఉద్యమానికి సారథ్యం వహించగల నాయకులందరినీ ఎక్కడికక్కడ ఇళ్లలోనే నిర్బంధించడం. పోలీసులను మోహరించి.. వ్యతిరేకగళం వినిపించకుండా చూడడం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇందుకు అతీతం ఎంతమాత్రమూ కాదు. కాకపోతే శనివారం నాటి పరిణామాలు పోలీసుల అరాచకత్వం గత ప్రభుత్వాల కంటె మేమే ఘనులం అని చాటుకున్నట్టుగా సాగింది.
మాజీ హోం మంత్రి సహా తెలుగుదేశం నాయకుల్ని ఎక్కడికక్కడ ఇళ్లలోనే కట్టడి చేశారు. కానీ అసలు కడుపుమంట తీవ్రంగా ఉన్న అమరావతి రైతులు మాత్రం ఆపితే ఆగలేదు. రోడ్డెక్కారు. ఉద్యమించారు.
వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు గురించే.. బాధంతా! వారేమీ చట్టవ్యతిరేక శక్తులు కాదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డం లేదు. మహిళలు రోడ్డుమీద బైఠాయించి మొండికేసినప్పుడు వారిక ముందుకు సాగకుండా అడ్డుకోవచ్చు. ఎటూ చాలా పెద్ద సంఖ్యలోనే పోలీసులను, సీఆర్పీఎఫ్ బలగాలను వారు మోహరించారు. ఆందోళన కారుల్ని చెదరగొట్టడానికి వారు ఎలా ప్రవర్తించారో ఈ వీడియోలో చూడవచ్చు.
ఆందోళనలను అణిచివేయడానికి కూడా అనేక ప్రజాస్వామ్య యుతమైన పద్ధతులున్నాయి. పోలీసులు వాటిని అనుసరించవచ్చు. ఇంత రాక్షసంగా కాకుండా కొంత మర్యాదగానూ ప్రవర్తించవచ్చు. చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటివి జరిగాయి కదా.. అని కొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబునాయుడు అడుగు జాడల్లో నడవాలని అనుకుంటున్నదా? అనే కోణంలోంచి వారు తమ వాదనను ఓసారి సమీక్షించుకోవాలి.
ఎక్కడైనా సరే.. పోలీసులు ప్రజాకంటకులుగా ఉండరు. రాక్షసులనే నింద వాళ్ల మీదనే పడుతుంది గానీ.. ఎవరి పట్లనైనా అమానుషంగా ప్రవర్తించడానికి వారికి వ్యక్తిగత ఆవేశకావేషాలు, ద్వేషాసూయలు ఉండవు. కానీ వారికి పైనుంచి ఉండే ఒత్తిడి, ప్రభుత్వం ఏం కోరుకుంటూ ఉన్నదో దానికి అనుగుణంగా తాము పనిచేయాలనే ఆలోచన ఉంటాయి. అలాంటి ఆలోచనలే వారి పనితీరును నిర్దేశిస్తాయి. అన్ని సందర్భాల్లోనూ పైనుంచి ఆదేశాలు ఉండకపోవచ్చు.. కానీ అంతర్లీనంగా ఏర్పడి ఉండే అభిప్రాయాలు, స్వానుభవాలు వారితో ఇలా ప్రవర్తింపజేస్తాయి.
క్షమాపణ అవశ్యం..
రైతుల చేతులకు బేడీలు వేసినందుకు పోలీసులను సస్పెండ్ చేసి.. అక్కడి పాప పరిహారం అయిపోయినట్లుగా పోలీసు అధికారులు భావించారు. నాయకుల ఆదేశాలు లేకుండానే పోలీసులు ఆ పనిచేశారా.. అంటూ చంద్రబాబునాయుడు ఆక్రోశించారు కూడా. ఇప్పుడు కూడా అలాంటి ప్రశ్నే ఎదురవుతోంది? రాజకీయ నాయకుల, ప్రభుత్వాధినేతల ఆదేశాలు లేకుండానే ఈ అమానుష కృత్యాలు చోటుచేసుకున్నాయా? మూల కారకులు ఎవరైనా కావచ్చు. కానీ.. ప్రభుత్వం మంచి చెడుల పట్ల తమకు బాధ్యత ఉన్నదని భావించే వారు ఇవాళ్టి పరిణామాలకు మన్నింపు అడగాలి. కనీసం ఆ పని కూడా చేయకుంటే ఈ పాపానికి నిష్కృతి లేదు.
వట్టి తప్పు ఘటియింపకు మీ
కలకంఠి కంట కన్నీరొలికిన
సిరి ఇంట నుండ నొల్లదు సుమతీ
..అంటాడు శతకకారుడు.
ఆడబిడ్డ కన్నీళ్లు చిందిన చోటు స్మశానం అవుతుంది. మరి ఆ కన్నీళ్లకు కారకులు అయ్యే పాలకులు, ఏలికలు ఏమౌతారు?
… సురేష్ పిళ్లె
(ఇదీ చదవండి : సోనూసూద్.. హీరోలను తలదన్నే ఇమేజ్ )