గడిచిన ఐదేళ్లూ పంది కొక్కుల్లా ప్రజాధనాన్ని మెక్కిన వైసీపీ నేతలకు..యోగాంధ్రకు పెట్టిన ఖర్చు దండగలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యోగాంధ్రకు ఖర్చు చేయడం వృథా అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. జగన్ తీరుపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇదే అంశంపై చంద్రబాబును కొంత మంది జర్నలిస్టులు ప్రశ్నించారు. ఐతే జగన్ కామెంట్స్‌ను ఆయన లైట్ తీసుకున్నారు.
రుషికొండ ప్యాలెస్ కోసం ఆరు వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్ యోగాంధ్ర ఖర్చు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబు. యోగాంధ్ర కోసం కేంద్రం కూడా రూ. 75 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. జగన్ రెడ్డి ప్రయారిటీలు వేరే ఉంటాయి. ఐ ప్యాక్, వాలంటీర్లు, ఇంటింటికి వైసీపీ వంటి కార్యక్రమాల కోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.పార్టీ ప్రచారం కోసం నిర్వహించే సభలకు జగన్ ప్రజాధనం ఖర్చుపెడతారని విమర్శించారు. బటన్ నొక్కే కార్యక్రమాలకు సభలు పెట్టి రాజకీయ ప్రసంగాలు చేసి..ప్రజాధనం ఖర్చుపెడతారని సెటైర్లు వేశారు చంద్రబాబు.
సీఎంగా ఉండి… జగన్ సొంత ఇంటికి వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టుకున్నారని..ఇప్పుడు కనీసం వాటిని తిరిగి ఇవ్వడం లేదన్నారు చంద్రబాబు. మూడు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడేవారని, ఆయన సాక్షి సిబ్బంది సగం మందికి కాంట్రాక్ట్ జాబ్‌లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు చంద్రబాబు. వైసీపీ సోషల్ మీడియా సిబ్బందికి ఆయన రకరకాల పేర్లతో జీతాలిచ్చారని గుర్తు చేశారు. అన్నీ కళ్ల ముందు ఉంటే.. ప్రధానమంత్రి మోదీ.. దేశ ప్రజల ఆరోగ్య అలవాట్లను పెంచేందుకు ప్రమోట్ చేస్తున్న యోగాను..గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా నిర్వహించడం మాత్రం డబ్బులు దండగంటున్నారని ఫైర్ అయ్యారు.
విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం..గిన్నీస్ రికార్డులు నమోదయ్యేలా నిర్వహించింది. తద్వారా బ్రాండ్ విశాఖను ప్రమోట్ చేసేందుకు అవకాశంగా మలుచుకుంది.