నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చంపేసే దిశగా జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోక తప్పేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉండగా.. జగన్ కేబినెట్ లోని కీలక మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతం రెడ్డిలు తమదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రాజధానులను తప్పవని, ఈ విషయంలో వెనకడుగే లేదన్న కోణంలో వారిద్దరూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేకపాటి నోట నుంచి ఈ ప్రకటన విడుదలైన రోజే.. అంటే మంగళవారమే హైకోర్టు ఇదే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని చెప్పిన హైకోర్టు.. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తమ తుది తీర్పు ప్రకారమే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
కర్నూలు నుంచి తిరుగు టపా తప్పదు
హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మూడు రాజధానులపై తుది తీర్పు వచ్చాక.. దానికి అనుగుణంగానే చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే అప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే.. అవి తుది తీర్పునకు వ్యతిరేకంగా ఉంటే.. వాటి విషయంలో వెనకడుగు వేయక తప్పదు. అంటే.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు గనుక వస్తే.. ఇప్పటికే న్యాయ రాజధానిగా జగన్ ప్రకటించుకున్న కర్నూలుకు తరలిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలను తిరిగి అమరావతికి తరలించాల్సిందే. అయితే హైకోర్టు తుది తీర్పు వెలువడేందుకు ఇంకా చాలా సమయమే పట్టవచ్చు. ఎందుకంటే.. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు 5 వారాలకు వాయిదా వేసింది. అప్పుడు కూడా తుది తీర్పు వచ్చే అవకాశాలు లేవు. ఎందకంటే.. ఈ వ్యవహారంపై చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి విచారిస్తామని చెప్పిన హైకోర్టు.. అందరు పిటిషనర్ల వాదనలు వినాల్సిందే కదా. అందుకే ఈ వ్యవహారంలో హైకోర్టు తుది తీర్పు ఇప్పుడప్పుడే వెలువడే ఛాన్సే లేదు. ఈలోగా జగన్ సర్కారు ఏ మేర దూకుడు చూపినా.. తిరిగి తమ నిర్ణయాలను వెనక్కు తీసుకోక తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
మంత్రులకు ఇవేవీ పట్టవా?
జగన్ కేబినెట్ లోని చాలా మంది మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. స్వయంగా జగనే మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. అందుకే కాబోలు ఆయన మూడు రాజధానుల ప్రస్తావనే ఎత్తడం లేదు. అయితే ఆయన కేబినెట్ లోని మంత్రులు మాత్రం మూడు రాజధానులపై ఇష్టారాజ్యంగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. జగన్ హాలీడే ట్రిప్ లో ఉండగా.. మూడు రోజుల క్రితం అమరావతిలోని సచివాలయంలో హడావిడి చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. మూడు రాజధానులపై వెనక్కెళ్లే ప్రసక్తే లేదని తేల్చేశారు. విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించి తీరతామని కూడా ఆయన పేర్కొన్నారు. తాజాగా మంగళవారం నాడు మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా ఇదే రీతిన మాట్లాడారు. మూడు రాజధానులను చేసి తీరతామని, సీఎం జగన్ ఎక్కడుంటే అదే రాజధాని కదా అని, శ్రీభాగ్ ఒప్పందం మేరకే తాము మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని ఏదేదో మాట్లాడేశారు. మేకపాటి వ్యాఖ్యలు బయటకు వచ్చిన కాసేపటికే.. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా.. తాము వెలువరించే తుది తీర్పునకు లోబడే ఉండాలంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.