కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు వ్యాక్సిన ఒక్కటే మార్గం. ఆ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించడంలో అన్ని దేశాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అయితే తొలి నాళ్లలో సరిపడినంత మేర వ్యాక్సిన్లు లేని కారణంగా.. అరకొరగానే వ్యాక్సినేషన్ జరిగింది. అలాంటి సమయంలోనే జూన్ 20న తాము మాస్ వ్యాక్సినేషన్ పేరిట ఒకే రోజు రికార్డు స్థాయిలో 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్లు అందించామని ఏపీలోని జగన్ సర్కారు చంకలు గుద్దుకుంది. ఈ దిశగా దేశంలో ఏ రాష్ట్రానికి దక్కని రికార్డు ఏపీ సొంతమైందని వైసీపీ శ్రేణులు గొప్పలు చెప్పుకున్నాయి. వ్యాక్సినేషన్ లభ్యత అంతంత మాత్రంగానే ఉన్న ఆ సమయంలో అంతమందికి ఒకేరోజు ఎలా వ్యాక్సిన్ అందించారని నాడే విమర్శలు వినిపించాయి. అయితే ఆ రికార్డు వ్యాక్సినేషన్ అసలు మతలబు ఇప్పుడు బయటపడిపోయింది. అదెలాగో చూద్దాం పదండి.
రికార్డులు దక్కితే ఫస్ట్ ప్లేస్ రాలేదే
ఒకే రోజు అత్యధిక మందికి వ్యాక్సిన్లు అందించిన విషయంలో జాతీయ స్థాయి రికార్డుల్లో తొలి రెండు స్థానాలు ఏపీ పేరిటే ఉన్నాయి. జూన్ 20న 13,26,271 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినది తొలి రికార్డు కాగా.. అంతకంటే ముందు ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినది రెండో రికార్డు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా.. దేశంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన టాప్ టెన్ రాష్ట్రాల జాబితాను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. రికార్డుల పరంగా తొలి రెండు రికార్డులను తన పేరిటే లిఖించుకున్న ఏపీ.. ఈ జాబితాలో కూడా ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి కదా. అందుకు విరుద్ధంగా జాబితాలో చివరి స్థానంలో.. అంటే పదో స్థానంలో ఏపీ నిలిచింది. ఇప్పటిదాకా ఏపీలో 2.93 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందాయి. ఈ లెక్కన జాబితాలోని తొలి తొమ్మిది రాష్ట్రాలు ఏపీ కంటే ఎక్కువగానే వ్యాక్సిన్లు వేసినట్టే కదా. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. 7.15 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసింది. మరి ఒకే రోజు రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసిన ఏపీకి ఈ జాబితాలో ఎందుకు తొలి స్థానం దక్కలేదు? మరి ఆ రికార్డుల లోగుట్టు ఏమిటో చూద్దాం పదండి.
వ్యాక్సిన్లు దాచి రికార్డులంటారా?
కరోనా కేసుల సంఖ్య, ఆయా రాష్ట్రాల జనాభా, ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి వేగం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు కేంద్రం వ్యాక్సిన్లను కేటాయించింది. ఈ దిశగా తమకు మరిన్ని వ్యాక్సిన్లు కావాలంటూ ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. మరే ఇతర రాష్ట్రం విజ్ఞప్తి చేయని విధంగా.. ప్రైవేట్ ఆసుపత్రులకు అందించిన వ్యాక్సిన్ కేటాయింపులను కూడా తమకే బదలాయించాలని కూడా జగన్ సర్కారు ఓ వింత వాదన కూడా చేసింది. మొత్తంగా ఏపీ డిమాండ్ చేసిన మేరకు వ్యాక్సిన్ డోసులు కేంద్రం నుంచి అందలేదు. ఏపీకే కాదు.. ఏ ఒక్క రాష్ట్రానికి కూడా డిమాండ్ కు సరిపడా వ్యాక్సిన్లు దక్కలేదు. మరి రికార్డులు ఎలా వచ్చాయంటారా? రోజువారీ వినియోగానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన వ్యాక్సిన్ డోసులను జగన్ సర్కారు.. దాచి పెట్టింది. అంటే.. ఓ వైపు వ్యాక్సిన్ కోసం జనం బారులు తీరుతుంటే.. రికార్డుల కోసం అర్రులు చాచిన జగన్ సర్కారు.. వ్యాక్సిన్లను పంపిణీ చేయకుండా దాచిపెట్టింది. వెరసి ప్రజల ప్రాణాలను గాల్లో దీపాలను చేసింది. ఇదే విషయాన్ని విపక్ష టీడీపీ నాడే బయటపెట్టినా.. ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు జగన్ సర్కారు మాయోపాయాన్ని బట్టబయలు చేసింది.
Must Read ;- కేంద్రం ఆటలా?.. జగన్ ఆడిస్తున్నారా?











