ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో అరాచకం రాజ్యమేలిందన్న ఆరోపణలకు అంతకంతకూ బలం చేకూరుతోంది. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జనాన్ని వేడుున్న జగన్ కు ఎలాగోలా అధికారం చేజిక్కగా… అప్పటిదాకా ఆయన వెంట సాగిన అనుచరగణం ఒక్కసారిగా పేట్రేగిపోయింది. ఈ దారుణాలను ఆపాల్సిన గురుతర బాధ్యత కలిగిన జగన్…అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రజలపై దౌర్జన్యాలు, దారుణాలకు పాల్పడటమే కాకుండా… తాను చెప్పినట్లుగా విపక్ష నేతలు, ఆయా పార్టీల నేతలకు నేరుగా బెదిరిస్తున్న తన అనుచర గణాన్ని చూసి జగన్ చంకలు గుద్దుకున్నారు. అంతేనా… అప్పటికే పోలీసులు రౌడీ షీటర్ గా గుర్తించిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను ఏకంగా ప్రభుత్వ సలహాదారుగా నియమించారట. అక్కడితో కూడా ఆగని జగన్… ఏకంగా రౌడీ షీటర్ గా ఉన్న అనిల్ కు ఏకంగా గన్ మన్ సౌకర్యాన్ని కూడా కల్పించారట. ఇదేదో జగన్ అంటే గిట్టని వారు చేస్తున్న ఆరోపణ ఎంతమాత్రం కాాదు. జగన్ నుంచి ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు గన్ మన్ సౌకర్యాన్ని పొందిన అనిల్ కుమారే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని రూ.50 ఇవ్వలాంటూ బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్ ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కేసులో అతడిని విచారించాల్సి ఉందని, అతడిని తమ కస్టడీకి అప్పగించాలనంటూ అరండల్ పేట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… బోరుగడ్డ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆదివారం రాత్రి తనకు అనారోగ్యంగా ఉందని అతడు చెప్పగా… పోలీసులు అతడిని గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బోరుగడ్డను పరిశీలించిన వైద్యులు…అతడికి గ్యాస్ ట్రబుల్ సమస్య మినహా మరేమీ సమస్యలు లేవని తెలిపారు. గ్యాస్ ట్రబుల్ కు మందులిచ్చి పంపారు. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో బోరుగడ్డ పలు కీలక అంశాలను వెల్లడించినట్లుగా తెలిసింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మమేరకు… జగన్ జమానాలో తాను ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించానని బోరుగడ్డ చెప్పాడు. స్వయంగా సీఎం జగనే తనకు ఈ పదవిని ఇచ్చారని కూడా అతడు చెప్పుకొచ్చాడు. ఇక ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి, నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు జారీ చేసిన ఆదేశాల మేరకు తనకు గన్ మన్ సౌకర్యం కూడా లభించిందని తెలిపాడు. మొత్తంగా జగన్ జమానాలో తాను అన్ని ప్రభుత్వ వసతులు, సౌకర్యాలతో జలాసాగా జీవనం సాగించినట్లు వివరించాడు బోరుగడ్డ. ఇక దాదాపుగా రూ.80 లక్షల ఖరీదు చేసే ఓల్గార్ కారును ఎలా కొన్నావని పోలీసులు ప్రశ్నించగా… తన పాత కారును అమ్మేయగా రూ.28 లక్షలు వచ్చాయని, తన సోదరీమణులు ఐదుగురు తలా కొంత సొమ్మును తనకు సర్దుబాటు చేయగా రూ.45 లక్షలతో సెకండ్ హ్యాండ్ ఓల్గార్స్ కారు కొన్నానని అతడు చెప్పాడు.
ఇదిలా ఉంటే… తనను అరెస్ట్ చేసిన కేసు విషయంలో మాత్రం బోరుగడ్డ ఎంతగా ప్రశ్నించినా కూడా నేరం ఒప్పుకోలేదట. రూ.50 లక్షలు ఇమ్మంటూ తాను బెదిరించినట్లుగా చెబుతున్న బాబు ప్రకాశ్ ఎవరో కూడా తనకు తెలియదని అతడు చెప్పాడు. రూ.50 లక్షలు ఇవ్వని నేపథ్యంలో బాబు ప్రకాశ్ కార్యాలయానికి వెళ్లి… ఆయనను కత్తితో బెదిరించి రూ.1 లక్ష లాక్కుని వచ్చావు కదా అన్న ప్రశ్నకు కూడా బోరుగడ్డ లేదనే చెప్పాడట. తనకు తెలియని వ్యక్తిని తానెలా బెదిరిస్తానని పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేసిన బోరుగడ్డ… ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించాడట. మరి నీపై బాబు ప్రకాశ్ ఎందుకు ఫిర్యాదు చేస్తాడన్న పోలీసుల ప్రశ్నకు తనదైన స్టైల్లో స్పందించిన బోరుగడ్డ… దళిత సామాజిక వర్గానికి చెందిన తాను రాజకీయంగా ఎదుగుతున్నానని చూడలేకే ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పాడట. మొత్తంగా ఈ కేసులో తన వాదనలను వినిపించిన బోరుగడ్డ… జగన్ జమానాలో జరిగిన అరాచక పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఘటనను రివీల్ చేశాడు.