ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకంపై అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకూ ఈ పథకం అమలు ఎప్పుడన్నది సస్పెన్స్ కొనసాగగగా..తాజాగా చంద్రబాబు ఆ సస్పెన్స్‌కు తెరదించారు. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు…ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించే తేదిని వెల్లడించారు చంద్రబాబు. కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి ఏపీలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఇప్పటికే కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం, వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు..ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కొక్కటిగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ..తల్లికి వందనం పథకం ప్రారంభించాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు..భేటీ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.











