ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లోని ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్ పెంపు, సిలిండర్ పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
తల్లికి వందనం..ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15 వేలు అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికి ఈ పథకం వర్తింపజేయనున్నారు.
ఈ పథకం విద్యార్థుల చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించారు. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్ ఇతర ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ సర్కార్ అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. కానీ ఈ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించేవారు. ఐతే కూటమి ప్రభుత్వం విద్యార్థుల అందరికీ రూ.15 వేలు అందించాలని నిర్ణయించింది. ఈ పథకం వల్ల ఆర్థిక కారణాలతో చదువు మధ్యలో మానేసే పరిస్థితులు ఉండవని కూటమి నేతలు చెప్తున్నారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక రెండు పథకాలు అమలులోకి తీసుకువచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్లు అందించింది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సైతం అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకాలతో పాటు త్వరలోనే అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి పథకాలు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.










