రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ప్రీతిసుడాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతూ..ఏపీ ప్రభుత్వం ఆ అధికారిణికి నోటీసులు జారీ చేయడం ఏపీలోని అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. 2005లో ఉమ్మడి ఏపీలో ఆమె తన వ్యక్తిగత సెలవు సమయాన్ని ఈఎల్‌గా మార్చుకున్నారన్న ఆరోపణతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. గతంలోనూ ఇలాంటి నోటీసు జారీ అయినా…సదరు అధికారి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఏపీ సర్కారు ఈ నోటీసు జారీ చేసినట్టు చెబుతున్నారు. ఇక్కడే మరో విషయం కూడా చర్చకు వస్తోంది. ప్రీతిసూడాన్ పై జగన్ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తుందనే చర్చ కూడా నడుస్తోంది. ప్రీతి సుడాన్, ఆమె భర్త రణదీప్ సుడాన్ లు 1983 బ్యాచ్ ఏపీ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారులు. అప్పట్లో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పని చేశారు.
పౌరసరఫరాలశాఖ వైస్ ఛైర్మన్, ఎండీగా ఉన్న సమయంలో..
ప్రీతి సుడాన్ అప్పట్లో పౌరసరఫరాల శాఖ వైస్‌ఛైర్మన్, ఎండీగా ఉన్న సమయంలో 2005 మార్చి 1 నుంచి 2006 ఫిబ్రవరి 28 వరకు తన కుటుంబంతో గడిపేందుకు ప్రత్యేక సెలవులు (ఈఓఎల్)పై అమెరికా వెళ్లారు. నిబంధనల ప్రకారం అలాంటి సెలవులకు ప్రభుత్వం వేతనం, అలవెన్స్‌లు చెల్లించదు. అయిత సెలవుల్లో వెళ్లిన ప్రీతి సూడాన్ ప్రభుత్వ అనుమతితో ప్రపంచబ్యాంకులో ఓ ప్రాజెక్టకు సేవలందిచారు. ఆ ప్రాజెక్టు గడువు ముగిశాక, మళ్లీ తన ఈఓఎల్‌ని 2006 మే నెలాఖరు వరకు పొడిగించుకున్నారు. తరువాత వివిధ విభాగాల్లో పనిచేసి 2013లో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.
రాష్ట్ర విభజన తరువాత ప్రీతిసూడన్ కేడర్ ఏపీకి కేటాయించారు. అయితే 2020లో ఆ అధికారిణి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉండగా, తాను 2005లో ప్రపంచబ్యాంకుతో పనిచేసిన రోజులు మినహా, మిగతా ఈఓఎల్ సమయాన్ని ఈఎల్ లేదా హాఫ్ పే లీవ్‌గా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆ శాఖలో..ఆమె అండర్ సెక్రటరీ అందుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జారీచేసే అధికారం సదరు అధికారికి లేదని, సదరు అధికారిపై ఒత్తిడి తెచ్చి ప్రీతిసూడాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు గతంలో నోటీసు జారీ చేసింది. ఇందుకు ప్రీతి సూడాన్ కూడా వివరణ ఇచ్చారు. ఆ వివరణ పరిగణించేదిగా లేదని, ఎందుకు చర్యలు తీసుకోకూడదో రెండు వారాల్లోగా చెప్పాలంటూ..ఇటీవల ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ నోటీసు జారీ చేశారు.
తెరపైకి స్థానిక ఎన్నికల నిలుపుదల అంశం..
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వివరణ అడిగితే తప్పేముందని ఓ వైపు చర్చ జరుగుతోంది. అదే సమయంలో మరో కోణంలోనూ చర్చ నడుస్తోంది. 2020లో పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికషన్ విడుదలైంది. అయితే ఆ సమయంలో కొవిడ్ ఎక్కువగా ఉందన్న కారణంగా ఏపీ ఎన్నికల సంఘం ఆ ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంపై ఇప్పటికీ ఏపీ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏపీ SEC ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అధికార వైసీపీ నేతలు ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలకూ దిగారు. అప్పట్లో ఏపీ ఎస్ఈసీ మాట్లాడుతూ.. తాము నిబంధనల మేరకే వ్యవహరించామని, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రీతి సుడాన్‌తో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారట. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రీతిసూడాన్‌తో సంప్రదింపులు జరిపారని, ఆ సంప్రదింపుల్లో ప్రీతిసుడాన్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుడి ఉంటానని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం జారీ అయిన నోటీసులకూ, ఈ వ్యవహారానికి సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన బెడితే..చర్చ మాత్రం నడుస్తోంది. మరోవైపు నిబంధనల ప్రకారం ప్రభుత్వం నోటీసు జారీచేసిందనే వాదన కూడా ఉంది.
కేంద్ర సర్వీసులకు ప్రీతిసూడాన్ ..
కాగా 1983 బ్యాచ్‌కి చెందిన ఏపీ కేడర్ అధికారి ప్రీతి సూడాన్. ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీపై పట్టా అందుకున్నారు. గతంలో రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శిగా, ప్రజాపంపిణీ వ్యవస్థ కార్యదర్శిగా, డైజాస్టర్ మేనేజ్ మెంట్ , పర్యాటక రంగాల్లో కార్యదర్శిగా చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా సేవలందించారు.కొవిడ్ నియంత్రణకు సంబంధించి WHO కార్యాచరణ కమిటీలో కీలకంగా వ్యవహరించారు.
రణదీప్ సుడాన్ పేరు తెరపైకి..
కాగా ప్రీతి సుడాన్ భర్త రణదీప్ సుడాన్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఏపీ కేడర్ నుంచి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఐటీ కార్యదర్శిగా పనిచేశారు. అనంతం ప్రపంచబ్యాంకుకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. అయితే వైఎస్ సీఎం అయ్యాక ఆయన డిప్యూటేషన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నా మళ్లీ కొన్ని రోజులకే డిప్యూటేషన్‌ను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయయని చెబుతున్నారు. 2009 వరకు ఆయన ప్రపంచబ్యాంకులోనే ఉన్నత హోదాలో సేవలందించారు. తరువాతి కాలంలో అప్పట్లో ఆయన డిప్యూటేషన్ కాలం పూర్తయినా వెనక్కి వచ్చినట్టు రిపోర్టు చేయలేదని వార్తలూ వచ్చాయి.
రాష్ట్ర విభజన తరువాత ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అధికారి అప్పట్లో ఎక్కడ సర్వీసులో ఉన్నారనే అంశంపై కొంత గందరగోళం నెలకొనడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ద్వారా కేంద్రానికి లేఖ కూడా పంపినట్టు వార్తలు వచ్చాయి. కాగా వీరిద్దరూ 2019, 2020ల్లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం రణదీప్ సుడాన్ ప్రపంచ బ్యాంకులో సేవలందిస్తున్నారు.