చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి నడుం బిగించారు అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ. చెల్లెలు ప్రియాంక గాంధీ అసోంలో ప్రచారం చేస్తుండగా అన్న రాహుల్ గాంధీ మాత్రం తమిళనాడు,కేరళల్లో ఎన్నికల ప్రచారంలో బస్కీలు తీస్తూ, ఈత కొడుతూ ప్రచార పర్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అయిదు రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఆరోపణలు , ప్రత్యారోపణలతో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజకీయం రంజుగా సాగుతోంది.
సెమీ ఫైనల్‌గా..
జమిలి ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అసోం , పశ్చిమ బెంగాల్ , పుదుచ్చేరి , తమిళనాడు , కేరళ రాష్ట్రాలలో శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూడటంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కొన్నాళ్ల పాటు రాజకీయంగా సుప్తచేతనావస్థలో ఉన్న రాహుల్ ఎట్టకేలకు సీనియర్ల ఒత్తిడితో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ఇదే సమయంలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా క్రియాశీల రాజకీయాల్లోకి రావడంతో నిస్తేజంగా ఉన్న పార్టీకి కొత్త సత్తువ అందించినట్లైంది.
అయితే గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా వరుస విజయాలు సాధిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో సెమీ ఫైనల్ లాంటి అయిదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారాయి. అందుకే రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం చేస్తున్నారు తమ పార్టీ గెలుపు కోసం. రాహుల్ ఈత కొడుతూ , బస్కీ లు తీస్తూ యువతని ఉత్సాహపరుస్తున్నారు. ప్రియాంక గాంధీ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ నానమ్మ ఇందిరా గాంధీని తలపిస్తూ ప్రచారరంగంలో దూసుకుపోతున్నారు.