GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు మంచి ఫలితాలనే సాధించాయి. అయితే శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికిలపడింది. రెండు సీట్లకే పరిమితమైంది. 2016లో ఆ పార్టీకి దక్కినన్ని సీట్లే మళ్లీ దక్కించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉన్నా.. ఈ ఓటమి నాయకత్వ లోపం వల్లే జరిగిందని చెప్పవచ్చు. ఇక గెలిచిన వారిలో ప్లస్ పాయింట్లు, ఓడిన వారిలో మైనస్ పాయింట్లు వెతకడం సాధారణమే. అయితే ఆ ఓటమి విషయంలో పార్టీలు ప్రశ్నించుకుంటే..పార్టీ కేడర్ కూడా వెంట నిలుస్తుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా?
ఇక GHMC ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న, పీసీసీ రేస్‌లో ఉన్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంతరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కేడర్ తమకే ఓట్లు వేసిందని, కాంగ్రెస్ ఓటమికి మీడియా కారణమని వ్యాఖ్యానించారు. ఇక్కడే పలు విమర్శలు వస్తున్నాయి. ఆయన కొడంగల్‌లో 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు కూడా ఆయన మీడియాను విమర్శించలేదు. కేసీఆర్‌ని విమర్శించారు. అయితే 2019లో దేశంలోనే పెద్దదైన మల్కాజ్‌గిరిలో పోటీ చేసి గెలిచారు. ఆ గెలుపులో సెటిలర్లు, ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారన్న అంచనాలు ఉన్నాయి. ప్రశ్నించే గొంతును గెలిపించాలని ప్రచారం చేశారు. అదే ఆయనకు నినాదంగా మారింది. GHMC ఎన్నికల్లోనూ ఆయన అదే నినాదంతో ముందుకు వెళ్లారు. తమను 25-30 సీట్లు గెలిపిస్తే.. కొంత బలం చేకూరితే.. అధికార పక్షం ఎందుకు పని చేయదో చూపిస్తానని చెప్పారు. ఉప్పల్, ఎల్‌బీనగర్, ఏఎస్‌రావు నగర్ తదితర చోట్ల అదే ప్రచారం చేశారు. అయితే ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. 2016లో వచ్చిన ఆ రెండు సీట్లతోనే ఇప్పుడూ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమిలో మీడియాను బాధ్యులను చేయడంపై సోషల్ మీడియాలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మీడియా తమని చూపలేదని విమర్శలు
మీడియా తమని చూపలేదని విమర్శలు చేసిన రేవంత్.. 2019 మల్కాజ్‌గిరిలో పోటి చేసినప్పుడు వ్యక్తిగతంగా ఓటర్లను కలిశారు. అప్పుడు మీడియాలో వచ్చిన కవరేజీ కంటే.. సోషల్ మీడియాలో వచ్చిన కవరేజీ, మౌఖిక ప్రచారం, గెలుస్తామనే నమ్మకమే కారణమైందనే విశ్లేషణలు వచ్చాయి. అయితే GHMC ఎన్నికల్లో ఆ పరిస్థితి కనిపించ లేదు. రేవంత్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబుతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు కూడా ప్రచారం చేశారు. అయితే టీఆర్ఎస్ ను ఓడించాలనే పట్టుదల మాత్రం కాంగ్రెస్ కేడర్‌లో కనిపించలేదు. మీడియాపై ఆధారపడి ఆయన 2019లో ప్రచారం చేయలేదు. కాని గెలిచారు. మీడియాలు, టీవీ ఛానెళ్లు, పేపర్లు ఎవరికి మద్దతుగా ఉన్నాయనే విషయంతో పాటు ఆర్థిక వనరుల విషయం పక్కన బెడితే.. బీజేపీ కేడర్‌లో కనిపించినంత పట్టుదల కాంగ్రెస్‌లో లేదని చెప్పవచ్చు. ఎన్నికల ముందురోజు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ ఎంఐఎం అన్నట్లుగానే కనిపించింది. కాంగ్రెస్ చాపకింద నీరులా ప్రచారం చేస్తుందని భావించినా..సక్సెస్ కాలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను గెలిపించడంలో విఫలం చెందారని చెప్పవచ్చు.
Also Read ;- ఆలె నరేంద్ర..బద్దం బాల్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ టైగర్స్
ఈ ఫలితాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను పరిశీలిస్తే..
- నాయకత్వ లోపం ప్రధానమైంది. కేడర్‌లో ఉత్తేజం లేదు.
- రేవంత్‌రెడ్డి, సీతక్కతో పాటు ఒకరిద్దరు లీడర్ల స్పీచ్‌లు తప్ప.. మిగతా వారి ప్రసంగాల్లోనే నిస్తేజం కనిపించింది.
- ఎన్నికలకు ముందే విజయశాంతి పార్టీని వీడతారనే ప్రచారం, స్వామిగౌడ్ బీజేపీలో చేరడం, బీజేపీకి చెందిన ప్రముఖుల పర్యటనలు బీజేపీలో విశ్వాసం నింపాయి. కేడర్‌లో ఉత్తేజం నింపాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడ్డాయి.
- ఇక కొన్ని వర్గాలను రెచ్చగొట్టే స్పీచ్‌ల విషయంలో బీజేపీ, ఎంఐఎంలపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ రకమైన స్పీచ్‌లకు దూరంగా ఉంది. అయితే ప్రశ్నించగలిగేది కాంగ్రెస్ కాదు.. బీజేపీయేనన్న అభిప్రాయం కూడా క్షేత్ర స్థాయికి వెళ్లింది.
- బీజేపీ ప్రతి సందర్భాన్ని వాడుకోగలిగింది. అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ వచ్చినా, నడ్డా, తేజస్వి సూర్య లాంటి వారు వచ్చినా.. ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంది. కేసుల విషయం ఎలా ఉన్నా ఓయూలో అడుగు పెట్టగలిగింది. ఇది కచ్చితంగా యువతలో చర్చకు కారణమైన అంశమే.
- వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విషయంలో బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. కాంగ్రెస్ మాత్రం ఆ వ్యాఖ్యల విషయంలో సాఫ్ట్‌గా స్పందించడం కొంత మైనస్ అయింది. అదే టైంలో వైసీపీ రియాక్ట్ కావడం కాంగ్రెస్‌కు నష్టం కలిగించింది.
- అక్బరుద్దీన్ పీవీ సమాధి విషయంలో చేసిన వ్యాఖ్యలపై వెంటనే బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరిగింది. కాంగ్రెస్ స్పందించినా.. బీజేపీ అప్పటికే ఆ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లగలిగింది.
- కాంగ్రెస్ పార్టీ మాత్రం కేడర్ ఉన్నా.. ఓటర్లను మాత్రం తమవైపు తిప్పుకోలేక పోయింది.
- మరో ముఖ్యమైన విషయానికి వస్తే.. బీజేపీ, టీఆర్ఎస్‌లు సోషల్ మీడియాలో చాలా స్పీడ్‌గా ఉన్నాయి. కాంగ్రెస్ ఆ స్పీడ్ అందుకోలేకపోయింది.
- ఇక అభ్యర్థుల ప్రచారం, వ్యక్తిగత ఇమేజ్, ఆర్థిక వనరులు, స్థానిక పరిస్థితులు కూడా గెలుపోటముల్లో కీలకంగా మారాయి.
- Must Read ;- బధిర కాంగ్రెస్ కు ఈ హెచ్చరికలు వినిపిస్తున్నాయా?