తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించి అన్ని విధాలుగా నష్టపోతున్నఏపీ సీఎం జగన్‌కు కేంద్రం చెక్ పెట్టబోతోంది. అందుకు తగిన వ్యూహం ఢిల్లీలో సిద్ధమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ బాధ్యత బీజేపీదేనంటూ రివర్స్ గేమ్ ఆడిన జగన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేంద్రం తదనంతర పరిణామాలపై దృష్టి పెట్టింది. ఇన్నర్ రింగ్ రోడ్డుపై రెండు రోజుల సీఐడీ విచారణ ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. తన తండ్రితోపాటు మొత్తం కుటుంబ సభ్యులను తప్పుడు కేసులతో వేధిస్తున్న వైనాన్ని లోకేశ్ ఆయనకు వివరించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాష్ట్రంలో ఆటవిక పరిస్థితి నెలకొందని, ఇప్పుడది పరాకాష్ఠకు చేరిందని లోకేశ్ ఏపీలో జరగుతున్న కుట్ర రాజకీయాలను అమిత్‌షాకు వివరించారు. గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్‌షానుకలవటం కుదరని లోకేశ్ ఈ సారి ప్రత్యేకంగా ఆయన్ను కలవటం ఏపీలో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ చేస్తున్నకుట్రలన్నీ తాము గమనిస్తున్నామని, ఏపీలో ఎన్నికలకు ముందు సరైన వ్యూహం అనుసరించే దిశగా ఆలోచన చేస్తున్నామని అమిత్ షా లోకేశ్‌కు చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ భేటీ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, లోకేశ్ పెద్దమ్మ పురందేశ్వరితోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆయన జైలు నుంచి బయటికి రాకుండా చూసేందుకు వరుసగా వేర్వేరు కేసులు పెట్టడం, తనను విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం గురించి వివరించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా తాము చేస్తున్న న్యాయ పోరాటం, అక్కడ కేసుల పరిస్థితి గురించి కూడా లోకేశ్ వివరించారు. .లోకేశ్ చెప్పిన వివరాలను అమిత్‌షా శ్రద్ధగా విన్నారు. చంద్రబాబుపైనా, లోకేశ్‌పైనా ఎన్ని కేసులు పెట్టారో అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
73ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అమిత్ షా అభిప్రాయపడ్డారట. ఈ భేటీ తర్వాత జగన్ కుట్ర రాజకీయాలకు త్వరలో చెక్ పెట్టబోతోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నాయి.











