ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన, ప్రగతి వారధులుగా నిలుస్తున్న రహదారులు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. ఈ రహదారులు గోతులమయమై ప్రయాణానికి అనువుగా లేకపోవడంతో గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రాణాలు హరీ మంటున్నాయి.
ప్రతిపాదనలతోనే ..
ఈ రహదారుల అభివృద్ధికి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. రహదారుల మరమ్మతులకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించడం, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామనడం పరిపాటయ్యింది. ఈ రహదారులు మరమ్మతులకు నోచుకోక పోవడం వల్ల ప్రగతిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. విజయనగరం జిల్లాలో అత్యంత కీలకమైంది సీఆర్‌ఆర్ (చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ) మార్గం. ఇటీవల దీన్ని 4వ నెం. రాష్ట్రీయ రహదారిగా పేరు మార్చారు. ఆర్ అండ్ బి అధికారులు ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే జరిపించగా రోజూ 13 వేల వాహనాలు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తున్నట్లు తేలింది. ఇందులో 70 శాతం పైచిలుకు అంతర్రాష్ట్రానికి వెళ్తున్నాయి. ఇంతటి కీలకమైన రోడ్డు అభివృద్ధికి ఏళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నా.. పట్టించుకునే వారే కరువవ్వడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు మంజూరైనా ..
విజయనగరం జిల్లా తెర్లాం మండలం కొత్తపేట నుంచి కొమరాడ మండలం కూనేరు వరకు దాదాపు 95 కి.మీ. మేర మరమ్మతులు చేపట్టేందుకు నిర్ణయించారు. విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా రామభద్రపురం వచ్చే వాహనాలు సీఆర్‌ఆర్ మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఇటీవల రామభద్రపురం నుంచి కూనేరు వరకు తాత్కాలిక మరమ్మతులకు రూ.11 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపగా రూ.1.06 కోట్లు మంజూరైనా, ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అయితే, సీఆర్‌ఆర్ ఆధునికీకరణ కాకుండా నిధుల సమీకరణకు టోల్ రహదారిగా మార్చేందుకు మరో ప్రతిపాదన చేశారు. దీనికి కూడా ఇంకా పూర్తిస్థాయి ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో 16 రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాలోనూ మూడు మార్గాల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు రోడ్ల ప్రగతికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.
రెండు దశాబ్దాలుగా ..
జిల్లాలో మరో కీలకమైనది విజయనగరం-హడ్డుబంగి రహదారి. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా ఒడిశా రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గమిది. ఇది 20 ఏళ్లుగా అభివృద్ధికి, విస్తరణకు నోచుకోలేదు. విజయనగరం నుంచి నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం, పాలకొండ మీదుగా హడ్డుబంగికి వెళ్లే ఈ దారి ఏపీ, ఒడిశా రాష్ట్రాలను కలుపుతోంది. ఈ మార్గానికి ఆనుకుని ఉన్న గరివిడి, నెల్లిమర్ల, గర్భాం, రాజాం, పాలకొండ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామికంగా మరింత ముందుకు సాగాలంటే ఈ దారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఇది రాష్ట్ర రహదారిగా ఉండిపోవడంతో నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇరువురు ఉపముఖ్యమంత్రులు, మరో ఇద్దరు కీలకమంత్రులు ఉన్నప్పటికీ ప్రజలకు ప్రధాన అవసరమైన రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా స్థానిక మంత్రులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.