తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కుంభకోణానికి సంబంధించిన మూలాలు ఉత్తరాదిలో ఉన్నట్లుగా తేలింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ.. మరో డెయిరీ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. ఆ మరో సంస్థ ఉత్తరాది నుంచి నెయ్యిని తెప్పించిన విషయం తాజాగా బయటికి వచ్చింది.
దీంతో ఏఆర్ డెయిరీ సంస్థ కచ్చితంగా కల్తీ నెయ్యే సరఫరా చేసిందనడానికి మరో బలమైన ఆధారం బయటపడినట్లు అయింది. ఏఆర్ డెయిరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు.. కాబట్టి, తిరుపతి జిల్లాలోని పునబాక వద్ద ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి కొని, టీటీడీకి సప్లై చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డెయిరీ ఉత్పత్తి చేసిందా అంటే అదీ కాదు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ నెయ్యి కొని, దాన్ని తిరుపతికి 500 కిలో మీటర్ల దూరంలోని ఏఆర్ డెయిరీకి సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ వేరే ఇన్‌వాయిస్ లతో తిరుమలకు పంపింది.
భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ కిలో నెయ్యిని రూ.355కి కొని.. ఏఆర్ డెయిరీకి రూ.318.57కి ఇచ్చింది. అదే నెయ్యిని, అవే ట్యాంకర్లలో ఏఆర్ డెయిరీ టీటీడీకి కిలో రూ.319.80కి సరఫరా చేసింది. అంటే వైష్ణవి డెయిరీ ప్రతి కిలో నెయ్యికి రూ.36.43 నష్టాన్ని భరిస్తూ ఏఆర్ డెయిరీకి అమ్మగా.. ఏఆర్ డెయిరీ కిలోకి కేవలం రూ.1.23 లాభం వేసుకుని టీటీడీకి సరఫరా చేసింది. అయితే, భోలేబాబా సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్, పొమిల్ జైన్‌లే వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌లోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ 2024 జనవరి 18న వైష్ణవి డెయిరీలో డైరెక్టర్లుగా చేరారు. దీన్ని బట్టి ఈ నెయ్యి విషయంలో ఏ రేంజ్‌లో కథ నడిచిందో అర్థమవుతోంది. ఆ నెయ్యి ఏకంగా 3,300 కి.మీ.లకు పైగా ప్రయాణించి రూ.319.20కి టీటీడీకి చేరిందంటే.. ఎంత పెద్ద మాయ జరిగిందో అర్థమవుతోంది.
అప్పటి టీటీడీ పాలకమండలి పెద్దలు కుమ్మక్కు కాకపోతే ఇంత భారీ స్కామ్ ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్టుల వేళ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ డెయిరీ కార్యకలాపాలపై కూపీ లాగింది. దీంతో ఈ విషయాలన్నీ బయటికి వచ్చాయి. జూన్, జులై నెలల్లో ఆ డెయిరీకి ఎక్కడి నుంచి ట్యాంకర్లు వెళ్లాయి.. వాటి ఇన్‌వాయిస్ నంబర్లు.. ఏయే టోల్‌గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించాయి వంటి వివరాలన్నీ కూపీలాగారు. డెయిరీ సంస్థలన్నీ కలసి మాఫియాగా కలిసి.. అప్పటి టీటీడీ పాలక మండలితో కుమ్మక్కై శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనడానికి అన్ని ప్రూఫ్స్ బయటపడ్డాయి.