దేశంలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అరగేట్రం చేస్తూ.. అక్కడి ప్రధాన పార్టీల తలరాతల్ని తన చిత్తమొచ్చినట్లుగా మార్చేస్తున్న మజ్లిస్ పార్టీ.. తమిళనాడులో కూడా రంగప్రవేశం చేయనుందా? వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా పోటీచేయబోతోంది. ఇటీవలే బీహార్ ఎన్నికల్లో గణనీయంగా తలపడి, సీట్లు సాధించడంతో పాటు, ప్రభుత్వంలోకి ఎవరు రావాలనే విషయంలో ప్రభావం చూపగలిగిన పార్టీగా ముద్ర వేసుకున్న ఎంఐఎం ఇప్పుడు తమిళనాట కూడా తన సత్తా చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ మేరకు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. తమ పార్టీ తమిళనాడు కార్యవర్గంలోని నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
‘ముస్లిం’ మతం ప్రాతిపదికంగా రాజకీయం నడుపుతున్న చిన్నా సన్నా పార్టీలు తమిళనాడులో అనేకం ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రధానంగా తలపడుతూ ఉండే రెండు ద్రవిడ పార్టీలో ఏదో ఒకదానితో ఈ చిన్న పార్టీలు ఇప్పటిదాకా అసోసియేట్ అయి ఉన్నాయి కూడా! ఇప్పుడు మజ్లిస్ రంగప్రవేశం చేస్తే.. వాటన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి.. వారితో కలిసి పోటాచేయాలని ఒవైసీ భావిస్తున్నారని సమాచారం. కనిష్టంగా 25 సీట్ల వరకు పోటీచేస్తారని అంటున్నారు.
కమల్ తో కలుస్తారా?
తమిళనాడులో ఇటీవలి కాలంలో పార్టీ ప్రారంభించి క్రియాశీలంగా పోరాడుతున్న నటుడు కమల్ హాసన్ తో కూడా మజ్లిస్ కలుస్తుందనే వార్తలొస్తున్నాయి. నిజానికి కమల్, ఒవైసీ ఇద్దరి మధ్య కొన్ని భావసారూప్య అంశాలున్నాయి. గతంలో మహాత్ముడిని చంపిన నాథూరాం గాడ్సేను టెర్రరిస్ట్ గా ప్రకటించాలని కమల్ డిమాండ్ చేస్తే దానికి ఒవైసీ మద్దతిచ్చారు కూడా. తమిళనాట ప్రస్తుతం ఉన్న పార్టీల్లో కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నిలకడగా గళం వినిపిస్తున్నది కమల్ ఒక్కరే. బీజేపీని ఆయన ఒక రేంజిలో తూర్పార పడుతున్నారు. ఒవైసీ కూడా బీజేపీ వ్యతిరేకత ఎజెండాగానే ముందుకు వెళ్లేట్లయితే కమల్ తో చేయికలపడంలో ఆశ్చర్యం లేదు.
తమిళనాడులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మణితనేయ మక్కల్ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తౌహీద్ జమాత్ వంటి పార్టీలు అనేకం ఉన్నాయి. వేలూరు, రాణిపేట, తిరుపత్తూర్, క్రిష్ణగిరి, రామనాథపురం, పుదుక్కోటై, తిరుచి, మధురై, తిరునల్వేలి జిల్లాల్లో గణనీయంగా ముస్లిములున్నారు. గెలుపోటముల్ని ప్రభావితం చేయడం మాత్రమే కాదు.. తామే గెలిచే రేంజి బలం కూడా పలు ప్రాంతాల్లో ఉంది. ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్.. తమ మజ్లిస్ పార్టీ పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాల గురించి సర్వే జరుగుతోందని గత నెలలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా.
మరి కమల్ తో కలుస్తారోర లేదో.. కలిసి పోటీచేస్తే ఎవరికి అనుకూలం అవుతుందో .. ఎవరికి ప్రతికూలం అవుతుందో ఇప్పుడే చెప్పలేం. అయితే.. తమిళనాట అరంగేట్రానికి మజ్లిస్ సిద్ధమవుతున్న సంగతి నిజం. త్వరలోనే మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: తమిళనాట కమల్-ఒవైసీ చెట్టపట్టాల్ ఫలిస్తాయా!