ప్రస్తుతం నటిస్తున్న “అన్నాత్తా” చిత్రం తర్వాత రజనీ సినిమాలకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలకే తన సమయాన్ని వెచ్చించనున్నారు ఈ నేపథ్యంలో రజనీ చివరి చిత్రం దర్శకుడిగా తన పేరు సినీ చరిత్రలో నిలిచిపోతుందని దర్శకుడు శివ ఫుల్ జోష్ తో ఉన్నారట. పేరున్న సీనియర్ దర్శకులకే కాదు చక్కటి ప్రతిభా పాటవాలున్న నవతరం దర్శకులు పి.ఎ.రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్ వంటి వారెందరికో రజనీ అవకాశాలిచ్చారు కూడా. ఆ కోవలో తనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని శివ చాలా పట్టుదలతో ఉన్నారు. అంతే కాదు స్క్రిప్ట్ లో కూడా కాస్త మార్పులు కూడా చేశారని వినిపిస్తోంది. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో అందరూ ఆశించే రజనీ స్టైల్ మిస్ కాకుండా మరింత హైలైట్ గా ఉండాలని శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

సోమవారం నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలైంది. తమిళనాడులో షూటింగ్ చేసినట్లయితే రజనీకి ఉన్నవిపరీతమైన మాస్ ఫాలోయింగ్ వల్ల ఆయనను చూడటానికి తండోపతండాలుగా ప్రేక్షకాభిమానులు తరలి వస్తారు. దాంతో షూటింగుకు అంతరాయం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ను ఎంచుకున్నారట. రజనీకి జనాల్లో ఉపయోగపడేలా ఎన్నికల లోపు తగిన సమయంలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ అందుకు ఈ చిత్ర నిర్మాత ఎంతవరకు మొగ్గుచూపుతారన్న అంశంపై అనుమానాలు లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే సన్ ఫిలింస్ పతాకంపై డ్.ఎం.కె. నేపధ్యం కలిగిన కళానిధిమారన్ ఈ చిత్రం నిర్మిస్తుండటమే ఈ అనుమానాలకు తావిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసేందుకు పక్కా ప్లానింగ్ తో చిత్ర యూనిట్ ముందుకు సాగుతోంది.
Must Read ;- రజనీకాంత్ ‘అన్నగారిని’ ఫాలో అవబోతున్నారా?











