కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో కలసి పనిచేస్తోన్న లోక్ జనశక్తి పార్టీ బీహార్ ఎన్నికలకు వచ్చే సరికి ఒంటరిగా బరిలో దిగడం అనేక రాజకీయ విశ్లేషణలకు అవకాశం కల్పిస్తోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ ఆకస్మిక మరణంతో బీహార్ ఎల్జేపీ బాధ్యతలు పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ భుజాలపై వేసుకున్నారు. నిజానికి కేంద్రంలో మంచి స్నేహితులుగా ఉన్న బీజేపీ, ఎల్జేపీ బీహార్ ఎన్నికలకు వచ్చేసరికి ఎవరికి వారే అన్న విధంగా ఎందుకు పోటీచేశారో, దీని వెనుక ఎలాంటి వ్యూహం దాగి ఉందో అనే అనుమానాలు రాకమానవు.
ఎల్జేపీ ఒంటరిగా ఎందుకు పోటీ చేసిందంటే?
బీహార్ లో ఎల్జేపీకి పెద్దగా పట్టులేదు. రెండు మూడు జిల్లాల పరిధిలో ఆ పార్టీ కొంతమేర ప్రభావం చూపుతుంది. అయితే ఆపార్టీకి చెందిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, బీహార్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మరణించడంతో సానుభూతి ఓట్లు వస్తాయని భావించారు. ఎల్జేపీని ఒంటరిగా బరిలోకి దింపితే కనీసం పది సీట్లయినా సాధించకపోతుందా? అని బీజేపీ వ్యూహకర్తలు భావించారట. చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని ఎల్జేపీ కనీసం పది సీట్లు సాధిస్తే బీహార్ లో బీజేపీ ముఖ్యమంత్రి ఉంటేనే మేం మద్దతు ఇస్తామని వారు ముందే ప్రకటించారు.ఈ మేరకు బీజేపీ పెద్దలు పావులు కదిపారని తెలుస్తోంది. అయినే అనూహ్యంగా ఎల్జేపీ ఒక్కసీటుకే పరిమితం అయింది. ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఒక్కరే గెలవడంతో బీజేపీ పన్నాగం పని చేయలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (Also Read;-బీహార్లో ఆర్జేడీకి దెబ్బ పడిన విధంబెట్టిదనిన..?
ఎల్జేపీని మంత్రివర్గంలోని తీసుకుంటారా?
బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీని ఒంటరిగా పోటీ చేయించి ఆ పార్టీకి బీజేపీ తీవ్రనష్టం చేసింది. అయితే ఎల్జేపీ నుంచి ఒకే ఒక్కడు, మాటిహాని నుంచి రాజ్ కుమార్ సింగ్ గెలిచారు. అయితే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ తిరిగి ఎన్డీయేలోకి వెళుతుందా.. అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే విషయాన్ని బీహార్ ముఖ్యమంత్రిని అడిగితే ఎల్జేపీని ఎన్డీయేలోకి తీసుకోవాలా? లేదా? అనేది బీజేపీ తేలుస్తుందని సమాధానం చెప్పారు. అంటే ఎల్జేపీని బీజేపీ ఆడిస్తోందని ఆయనకు కూడా స్పష్టత ఉన్నట్లే కనిపిస్తోంది. వారికి భవిష్యత్ లోనూ ఎల్జేపీ సేవలు అవసరం ఉంటాయి కాబట్టి వారికి సానుకూలంగానే వ్యవహరించేఅవకాశాలను తోసిపుచ్చలేం.
మంత్రివర్గంలో మేం చేరం..
బీహార్ మంత్రివర్గంలో తాము చేరడం లేదని 4 స్థానాలు సాధించిన హిందూస్థానీ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఘీ స్పష్టం చేశారు. తాను ఎన్డీయేలో చేరడు కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్డీయేలో చేరి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని మాంఘీ పిలుపునిచ్చారు. మాంఘీ వ్యాఖ్యలతో రాజకీయ విశ్లేషకులకు మరోసారి పనిపడింది. బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేసి కాషాయ జెండా ఎగురేయాలని భావిస్తున్న బీజేపీ అగ్రనేతల వ్యూహాల్లో ఇదొకటని భావించాల్సి వస్తోంది. బీహార్ లో కాంగ్రెస్ ను తుడిచివేస్తే ఇక బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావడానికి దాదాపు మార్గం సుగమం అవుతుందని ఆపార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారనేదానికి మాంఘీ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
AlsoRead;-ఈవీఎంలను మరోసారి ట్యాంపర్ చేశారా?











