(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా, పెద్దదిక్కుగా, సచ్ఛీలుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజవంశీకుడు, కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును రాజకీయంగా అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మాన్సాస్’లో మంటలు పెట్టిందా ? అంటే అందరినోటా అవుననే సమాధానమే వస్తోంది.
నాలుగుదశాబ్దాలుగా ప్రత్యేక పరిస్థితుల్లో ఒకటి, రెండు సార్లు తప్ప అప్రతిహతంగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న పూసపాటి వంశీయుడు అశోకగజపతి హవా స్థానికంగా అందరికీ తెలిసిందే. ఆయనని విజయనగరంలో రాజకీయంగా నిలువరిస్తేనే తప్ప వైసీపీ భవిష్యత్ రాజకీయాలకు భరోసా లభించదనే ఆ పార్టీ భావించినట్లుంది.
ఈ ఉద్దేశంతో ఇదే అదనుగా ఆయన ఆయువు పట్టైన మాన్సాస్‌పై ఆధిపత్యం సంపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం పథకరచన చేసింది. అశోకగజపతి అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న తరుణంలో ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి అశోక్ సొంత అన్నయ్య ఆనందగజపతి తొలిభార్య కూతురు సంచైత గజపతిని మాన్సాస్ ఛైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
అశోకగజపతి తేరుకునే సమయంలోనే సంచైత మాన్సాస్ బాధ్యతలు చేపట్టడం, రికార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగిపోయింది. అశోకగజపతి రాజు తండ్రి స్వర్గీయ పి.వి.జి. రాజు 1958లో మాన్సాస్ ట్రస్టును ఏర్పాటు చేశారు. అప్పటికే తను నివసిస్తున్న విజయనగరం కోటను, 14,000 ఎకరాల భూమిని తన తండ్రి మహరాజ అలక్ నారాయణ గజపతి పేరున స్థాపించిన మాన్సాస్ ట్రస్టుకు దానం చేశారు. ఈ ట్రస్టు పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంతో పాటు 108 ఆలయాలు, 12 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. లక్షలాది మంది ఓటర్లు రాజావారి అనుగ్రహంతో విశ్వాసపాత్రులై స్థిరమైన ఓటుబ్యాంకుగా నిలుస్తున్నారు.
ఆ నేపథ్యంలోనే పివిజి కుటుంబం నుండి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆనందగజపతి, అశోకగజపతి అప్రతిహత విజయాన్ని కొనసాగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒకసారి ఓటమి పాలైనా, రెండోసారి మరింత సానుభూతితో విజయం సాధిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున విజయనగరం పార్లమెంట్ స్థానం నుండి అశోకగజపతి, విజయనగరం అసెంబ్లీ నుండి ఆయన తన కుమార్తె అధితి గజపతి బరిలో దిగి వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన హవా వల్లే ఇది సాధ్యమైందని వేరే చెప్పక్కర్లేదు.
ఇదే అదనుగా స్థానిక వైసీపీ కేడర్ అశోకగజపతిని రాజకీయంగా అణగదొక్కి, ఆయన వారసులకు అవకాశం లేకుండా చేయాలని సంకల్పించాయి. ఆయన ఆయువుపట్టును మట్టుపెట్టాలని వారు భావించారనడంలో సందేహం లేదు. మాన్సాస్ వారసత్వపు హక్కులపై అశోకగజపతి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై రానున్న ఫలితం ఎలావున్నప్పటికీ, ప్రజల్లో మాత్రం విశ్వాసం సన్నగిల్లిందని చెప్పక తప్పదు. ఆరు దశాబ్దాలుగా కోట్లాది ఆస్తులతో కూడిన మాన్సాస్ పై ఏ రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించలేదు. భవిష్యత్ లో అధికారం చేపట్టే ఏ ప్రభుత్వమూ మాన్సాస్‌ను వదులుకోదు. అందువల్ల రాజా గారి రాజకీయ ప్రస్థానం మాన్సాస్ తోనే ముగిసినట్టుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.