ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నువ్వా..నేనా అంటూ సంబంధిత వాటర్ బోర్డులకు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. అయితే కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశంపై ఇప్పటికే కేఆర్ఎంబీ వివరణ అడిగింది. ఈ మేరకు తెలంగాణ నీటి రంగ నిపుణులతో చర్చించి ఏపీతో తాడోపేడో తెల్చుకునేందుకు సద్ధమవుతోంది. ఏపీ సీఎం జగన్ రెడ్డి కూడా అంతేస్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ సర్కార్ తీరును నిరసిస్తూ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాయడంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతోంది.
చట్టబద్ధమైన హక్కుల్ని కల్పించండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య జల వివాదం తీవ్రరూపం దాల్చడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇరు రాష్రాల సీఎం లు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కు లేఖ రాశారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణకు కృష్ణా జలాలు అందడం లేదని, తద్వారా తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని వెంటనే నిర్ణయించి, తెలంగాణకు చట్టబద్ధమైన హక్కులను కల్పించాలని లేఖ కోరారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నా, సీఎం కేసీఆర్ కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణకు తీవ్ర నష్టం
విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగంపై మేనేజ్ మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం ఇప్పటివరకు నోటిఫై చేయలేదని లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు కట్టాలన్నా, విస్తరించాలన్నా అపెక్స్ కౌన్సిల్, కృష్ణాబోర్డు అంగీకారం ఉండాలని, ఏపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 811 టీఎంసీల నీరు దక్కాలనీ, కేసీఆర్ తీరు వల్ల 299 టీఎంసీల నీళ్లు మాత్రమే తెలంగాణకు అందుతున్నాయని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో బండి సంజయ్ ప్రస్తావించారు.