( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన “ ఎం వి మా” నౌక మరో నెల రోజులకుపైగా విశాఖ తీరంలోనే ఉండనుంది. వాయుగుండం కారణంగా ఈ నెల రెండో వారంలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ నౌక ను చూసేందుకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతుండటంతో అధికారులు నౌక సమీపంలోకి ఎవరిని రానివ్వడం లేదు. నౌకను మళ్లీ సముద్రంలోకి పంపేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా నౌకలో ఉన్న చమురు మొత్తాన్ని గురువారం వరకు తీస్తూనే ఉన్నారు. తొలుత 50 వేల లీటర్ల చమురు మాత్రమే ఉందని భావించిన రెస్క్యూ టీం అంచనాలకు మించి 80 వేల లీటర్ల ఆయిల్ వెలికితీసి ట్యాంక్ క్లీన్ చేశారు. ట్యాంకుకి ఏమైనా లీకులు ఉన్నాయా? అన్నదానిపై నిశితంగా పరిశీలిస్తున్నారు. దాన్ని సురక్షితంగా సముద్రంలోకి పంపే ప్రక్రియ కోసం ముంబైకి చెందిన కన్సల్టెంట్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనలైజ్ అయితే రెండు మూడు రోజుల్లో నౌకను సముద్రంలోకి ఎలా చేర్చాలన్న అంశం కొలిక్కి వస్తుంది. సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సమయంలో రాళ్ళ మధ్య ఇరుక్కుంది. ఇప్పుడు రాళ్లను తొలగించి సముద్రంలోకి పంపాలా? అడుగుభాగం ఎంతమేరకు దెబ్బతింది? పరిశీలించనున్నారు. బెలూన్ ఆపరేషన్ పేరట మరో ప్రక్రియ ద్వారా కూడా దీన్ని బయటకు తీసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలయ్యాక 20 నుంచి 40 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ నౌక విశాఖవాసులతోనే ఉండనుంది.










