ఏపీ ప్రభుత్వ సిబ్బంది చర్యపై ప్రధాన బ్యాంకర్ల ఫోరం సీరియస్ అయింది. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి బ్యాంకు ఉద్యోగుల యునైటెడ్ ఫోరం ఘాటుగా స్పందించింది. బ్యాంకుల గేట్ల ముందు చెత్తవేసిన వారిని గుర్తించి వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో తేల్చేందుకు జుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని బ్యాంకు ఉద్యోగుల యునైటెడ్ ఫోరం డిమాండ్ చేసింది. బ్యాంకుల ప్రధాన గేట్ల ముందు చెత్త వేయడం ద్వారా బ్యాంకు ఉద్యోగులు మనోధైర్యం దెబ్బతీశారని, ఇలాంటి చెత్త పని చేస్తారని ఎవరూ ఊహించలేదని యునైటెడ్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి బ్యాంకు కస్టమర్ డబ్బుకు భద్రత కల్పిస్తూ సరైన లబ్దిదారులకు పథకాలు చేరవేయడం బ్యాంకుల ముందు చెత్తవేసినంత తేలికైన పనికాదని బ్యాంకు ఉద్యోగుల యునైటెడ్ ఫోరం సీఎంకు రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కరోనాను ఎదుర్కొని పనిచేస్తున్నాం
11 నెలల కరోనా కాలంలో బ్యాంకర్లు అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కాలంలో అనేక ఉద్దీపన ప్యాకేజీలు, పథకాలు ప్రకటించాయి. వాటిని సకాలంలో లబ్దిదారులకు అందించేందుకు మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. ఏ పథకమైనా, వ్యక్తిగత రుణాలు ఇవ్వాలన్నా, వాటిని పరిశీలించడానికి బ్యాంకులకు కొంత సమయం తప్పనిసరిగా పడుతుందని బ్యాంకర్ల సంఘం అభిప్రాయపడింది.
రౌడీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల గేట్ల వద్ద ఏపీ ప్రభుత్వ సిబ్బంది చెత్త డంప్ చేయడం లాంటి రౌడీ చర్యలను ఆల్ ఇండియా బ్యాంకర్లు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంలో అనేక శాఖలు ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో అనేక కారణాల వల్ల వెనకబడుతూనే ఉండటం చూస్తూనేం ఉన్నామని, ఆ శాఖల కార్యాలయాల గేట్ల ముందు చెత్త డంప్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఒక్క సారి సీఎం ఆలోచించాలని వారు లేఖలో ప్రశ్నించారు. సామాన్య పేద ప్రజలకు సేవలు అందిస్తున్న దేవాలయాల్లాంటి బ్యాంకుల ముందు చెత్త డంప్ చేయడం అనాగరిక చర్యగా భావిస్తున్నామని, సామాన్యుల పట్ల ప్రభుత్వ సిబ్బంది తీరు ఎలాగుందో ఈ చర్య ద్వారా ప్రజలకు తెలసిపోయిందని బ్యాంకర్ల యూనియన్ అభిప్రాయపడింది. ఈ చర్యకు పాల్పడిన వారిని సస్పెండ్ చేసి, వెంటనే జుడీషియల్ ఎంక్వయరీ వేసి, దీని వెనుక ఎవరున్నా వారిని కూడా సస్పెండ్ చేయాలని బ్యాంకు ఉద్యోగుల యునైటెడ్ ఫోరం డిమాండ్ చేసింది.
చెత్తపనిపై కేంద్రం సీరియస్
ఏపీలో జగనన్నతోడు రుణాలు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వ బ్యాంకుల ముందు చెత్తవేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కూడా సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ ఏపీ ఆర్థిక మంత్రిని ఆదేశించారు. దీనిపై ప్రభుత్వ విచారణకు పురపాలక శాఖ జేడీకి బాధ్యతలు అప్పగించింది. అయితే అసలు కారకులను వదిలేసి చివరకు పారిశుధ్య కార్మికులను బలిచేస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.