సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? ఈ నెల 31న ఆయన రాజకీయ పార్టీ పేరు ను ప్రకటిస్తారా? ఆయన సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్ మళ్లీ ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నలే రజినీ అభిమానులను వేధిస్తున్నాయి. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో రజినీకాంత్ చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఈరోజు సాయంత్రం డిశ్చార్జి చేస్తారని తెలుస్తోంది.
డిశ్చార్జి అయిన వెంటనే ఆయన ఈ సాయంత్రం చెన్నైకి వెళ్లిపోనున్నారు. షూటింగ్ కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే. ఆయన రాజకీయ పార్టీ మొదలుపెడదామనుకుంటున్నప్పటి నుంచి ఏదో ఒక ఆటంకాలు మొదలవుతున్నాయి. ఇది దేనికి సంకేతమో ఆయన కుటుంబికులకు కూడా అర్థం కావడం లేదు. ఆయన అనారోగ్య పరిస్థితి చెన్నైలో జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండి ఉండేది.
ఆస్పత్రి పరిసరాలన్నీ ఆయన అభిమానులతో నిండి ఉండేవి. హైదరాబాద్ లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. హైదరాబాద్ లోని చాలా హోటళ్లలో రజినీ బృందాలన్నీ దిగిపోయినట్టు తెలుస్తోంది. అపోలో ఆస్పత్రి వద్ద మీడియా బృందాలన్నీ షిఫ్టుల వారీగా అక్కడే ఉంటున్నాయి. రజినీ చెన్నైకి వెళ్లే వరకూ రజినీ అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు హైదరాబాద్ లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు.
పార్టీ పరిస్థితి ఏమిటి?
రజినీ మాట ఎలా ఉన్నా అందరి నోటా వినిపిస్తున్న మాట ఒక్కటే.. ఇంతటి అనారోగ్యకర వాతావరణంలో ఆయనకు రాజకీయాలు అవసరమా అని అందరూ అంటున్నారు. పైగా రాజకీయాలంటే సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదు.. మహామహులే నేటి రాజకీయాలకు తట్టుకోలేక వాటిని వదులుకుని మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. సినిమాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండక రజినీకి ఈ తలనొప్పులు ఎందుకు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అయితే రజినీ ఒక నిర్ణయం తీసుకోనంతవరకే తీసుకున్నాక వెనక్కి తగ్గని నైజం ఆయనది.
మరి ఈసారి ఏంచేస్తారో చూడాలి. ఈ నెల 31న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనికి ఇంకా మూడు రోజులే గడువుంది. రాజకీయాలు వద్దంటూ కొంతమంది ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. 31వ తేదీ సమావేశం విషయం రజినీ చెన్నైకి వెళితేగాని కొలిక్కి రాదు.
అనారోగ్యంపై భిన్న వాదనలు
‘అన్నాత్తే’ షూటింగులో ఆరుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. రజినీకి వైద్య పరీక్షలు చేసి నెగిటివ్ గా నిర్దారణ చేశారు. పాజిటివ్ కాకుంటే ఎందుకీ అనారోగ్యం అనే వాదన కూడా ఉంది. ఆయనకు పాజిటివ్ ఉన్నా బయటికి చెప్పడం లేదనే మరో వాదన ఉంది. జనం ఆందోళన చెందటానికి కారణం గతంలో కొందరి విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే వైద్యుల బులెటన్ లను జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన అభిమానులు భయాందోళనలకు గురవుతారనే ఉద్దేశంతోనే అసలు విషయాన్ని బయటపెట్టడం లేదని భావిస్తున్నారు. ఇలాంటి వదంతులకు చెక్క పెట్టాల్సిన బాధ్యత అపోలో ఆస్పత్రి వర్గాలపైన కూడా ఉంది.
వైరల్ అయిన మమ్ముట్టి ట్వీట్
సూపర్ స్టార్ రజినీ కాంత్ పై మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘సూర్యా.. నువ్వు త్వరగా కోలుకోవాలి.. నీ దేవా’ అనేలా ట్వీట్ చేశారు. వీరిద్దరూ మణిరత్నం దర్శకత్వంలో ‘దళపతి’ చిత్రంలో ప్రాణ స్నేహితులుగా నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్రల పేరుతోనే మమ్ముట్టి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అందరి హృదయాలను దోచుకుంది. చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు రజినీ కోలుకోవాలని కోరుకుంటున్నారు. నటి ఖుష్బూ కూడా రజినీ కుమార్తె ఐశ్వర్యతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, మోహన్ బాబు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులెందరో రజినీ కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read:రజినీ పిలుపు; తమిళనాట ఏ రాజకీయ మలుపు?
Get well soon Soorya
Anpudan Deva pic.twitter.com/r54tXG7dR9— Mammootty (@mammukka) December 26, 2020











