కెరీర్ బిగినింగ్ లో చిన్న సినిమాలు, అడల్టరీ మూవీస్ తీసి… బూతు దర్శకుడిగా ముద్ర పడ్డాడు మారుతి. అల్లు వారి కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ చేయడం వల్లనో ఏమోగానీ.. వారి బ్యానర్ లోనే ఏకంగా నానీతో ‘భలేభలే మగాడివోయ్’ లాంటి బిగ్గెస్ట్ మూవీ చేయగలిగే ఛాన్స్ దక్కింది. ఆ సినిమా ఘనవిజయం సాధించడం వల్ల… అతడి రేంజ్ ఇంకాస్త పెరిగింది. వెంకీతో ‘బాబు బంగారం’ సినిమా చేసే లక్కీ ఛాన్స్ కూడా దక్కింది. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టకపోయి ఉంటే.. ఈ పాటికి మారుతి స్టార్ డైరెక్టర్ హోదాలో ఉండేవాడు. అలా జరగనందుకే మారుతి కెరీర్ మళ్ళీ మీడియమ్ రేంజ్ హీరోల స్థాయికి పడిపోయింది.
శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజలతో వరుసగా సినిమాలు చేసి.. సెట్ రైట్ అయ్యాడు మారుతి. ఇప్పుడు ఈ దర్శకుడు మళ్లీ పెద్ద హీరోలతో సినిమాలు చేసే స్థాయిని అందుకున్నాడు. త్వరలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నిర్మాణ భాగస్వాముల్లో ఒకరైన యూవీ క్రియేషన్స్ వారు మారుతితో ఒక బిగ్గెస్ట్ మూవీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ముందుగా శర్వానంద్ తో మారుతి తదుపరి సినిమా చేయబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు రవితేజ తోనే నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
రవితేజ అనగానే ఓ పెద్ద సినిమా తెరకెక్కబోతోంది అని అర్ధమవుతోంది. మారుతి లాంటి ఎంటర్ టైనర్ చేతిలో పడితే.. ఆ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అనే విషయం కూడా స్పష్టమవుతోంది. రవితేజని సరైన రీతిలో వినియోగించుకోవాలే గానీ… అతడిలో ఉన్న ఎంటర్ టైనర్ అద్భుతమైన ఔట్ పుట్ ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అతడితో ఒక చిక్కుంది. అతడితో ప్రయోగాలు కానీ, రొటీన్ సినిమాలు కానీ చేస్తే .. మొదటికే మోసం వస్తుంది. ఈ సంగతి బాగా తెలిసిన మారుతి.. రవితేజ తో ఒక వెరైటీ ఎంటర్ టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఒక రకంగా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకి సీక్వెల్ లాంటిదట.
ఆ సినిమాలో నానీ మతిమరపు ప్రాబ్లెమ్ ని, ‘మహానుభావుడు’ లో శర్వానంద్ ఓసీడీ సమస్యను .. మిక్స్ చేసి.. రవితేజ తో ఒక అదిరిపోయే వినోదాత్మక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట మారుతి. ఆ రెండు సమస్యలు రవితేజ కు ఉంటే.. అది ఏ రేంజ్ ఎంటర్ టైనర్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ తరహా సినిమాలు రవితేజకు కొట్టిన పిండి. ఆల్రెడీ కిక్ లో అతడు చేసిన మతిమరపు యాక్టింగ్ కు మంచి అప్లాజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో రవితేజ పూర్తి స్థాయిలో అలాంటి పాత్ర పోషిస్తుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమా రవితేజ కి, మారుతికి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.