ప్రభుత్వ పాఠశాలలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన సిబ్బందికి ఆరు నెలల కాలంగా వేతనాలు విడుదల చేయలేదు.
మధ్యాహ్న భోజన పథకం ద్వారా కోడి గుడ్లు, చిక్కీలు, పంపిణీ చేస్తున్న వారికి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. తమకు వేతనాలు చెల్లించండి మహా ప్రభు అంటూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
చెమటోడ్చి…. వారి శ్రమను పెట్టుబడిగా పెట్టి పనిచేసే కార్మికులకు రాష్ట్రంలో దక్కుతున్న గౌరవం ఇది.

మరోవైపు… వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని.. కులాలు.. మతాలు.. లింగ భేదాలు చూపుతూ పప్పు.. బెల్లంలా పంచుతున్న ప్రభుత్వ వైఖరిని చూసి ఏమనాలో… కాస్తోకూస్తో జ్ఞాన ఉన్నవారికి సైతం అర్థం కావడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎవరూ కాదనరు… కానీ కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు… ఉంది ప్రభుత్వం తీరు. రాష్ట్రంలో శ్రామిక వర్గానికి న్యాయం చేసిన తర్వాత… లక్షల కోట్ల రూపాయలను నగదు రూపంలో పంచిపెట్టినా ప్రశ్నించే వారు ఉండరేమో!
లాక్ డౌన్ కారణంగా మార్చి నెల నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేసే కార్మికులందరూ రోడ్డున పడ్డారు. కరోనా కష్టకాలంలో పౌష్టిక ఆహారం పంపిణీ చేసే వారికి నెలవారీ జీతాలు ఇవ్వకుండా… అనేక రకాల పథకాల పేరిట ఎవరెవరి ఖాతాల్లో నగదు జమ చేయడం అంటే … ప్రజల్ని సోమరిపోతులు గా మార్చడం కాకుంటే ఇంకేంటండి? అని అని కష్టజీవులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రానికి కాబోయే పరిపాలనా రాజధాని మహా విశాఖ నగరంలో జీవీఎంసీ కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. వారికి చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద సొమ్ములు లేవు. టెండర్ల ప్రకారం పనులు పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టలో పెడతామని అధికారులు హెచ్చరిస్తు ఉండడంతో భవిష్యత్తులో సివిల్ పనులు విశాఖలో జరుగుతాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. గత్యంతరం లే ని పరిస్థితుల్లో వారంతా రూపాయలు కోట్లు బకాయిలు ఉన్నా కిమ్మనకుండా పనులు చేసేందుకు అంగీకరించారు.