ప్రాణాపాయ స్థితిలో స్నేక్ ఫ్రెండ్ భాస్కర్!
టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రాణాలను నిలుపుకునేందుకు ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. పది వేలకు పైగా పాముల ప్రాణాలను కాపాడి.. అడవి సురక్షితంగా వదిలిపెట్టిన భాస్కర్.. నేడు అదే పాము కాటుకు గురై ప్రాణాలను నిలుపుకునేందుకు పోరాడుతున్నారు. నిన్న రాత్రి ఓ పామును పట్టే ప్రయత్నంలో ఆయన విషపూరిత పాము కాటుకు గురయ్యారు. దీంతో టీటీడీ అధికారులు వెంటనే ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్సను అందింస్తున్నారు.
టీటీడీ లో 25 ఏళ్లుగా సేవలు ..
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 25 ఏళ్లుగా పాములు పట్టే ఉద్యోగంలో భాస్కర్ నాయుడు విశేషంగా మన్ననలు అందుకున్నారు. శ్రీవారి సన్నిధిలో సుమారు 10 వేలకు పైగా పాములను పట్టుకున్నారు. వాటికి ఎటువంటి అపాయం జరగకుండా భద్రంగా, సురక్షిత ప్రాంతమైన అడవిలో వదులుతుంటారు. ఫారెస్ట్ మజ్దూర్ గా రిటైర్ అయినప్పటికీ.. భాస్కర్ టీటీడీ సేవలు అందిస్తున్నారు. ఎంతో చాకచక్యంగా, అవలీలగా పాములను పట్టుకోవడంలో భాస్కర్ కు మంచి గుర్తింపు ఉంది. అలానే తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో భాస్కర్ నాయుడు పేరు తెలియని వారుండరు. అటువంటి వ్యక్తి ప్రస్తుతం పాము కాటుకు గురై, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ఆపాయం జరగకుండా ఆరోగ్యంగా తిరిగి రావాలని తిరుమలేశ్వరుడిని ప్రార్థిస్తున్నారు.











