వల్లభనేని వంశీమోహన్… 2019 దాకా గన్నవరమే కాదు… మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోనే ఓ బలమైన రాజకీయ నేత. విజయవాడలో వంశీకి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ మరే నేతకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక గన్నవరంలో ఆయన ఎన్నికల్లో నిలబడితే చాలు విజయం ఆయనదేనని నానుడి కూడా బలపడిపోయింది. అలాంటిది 2024 ఎన్నికల్లో వంశీ ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ఆయన పత్తా లేకుండా పోయారు. ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే తప్పించి… వంశీ బయటకు రావడం లేదు.
తాజాగా సోమవారం ప్రజా ప్రతినిధుల కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో వంశీపై నాలుగు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ కేసుల విచారణలకు గత కొంతకాలంగా వంశీ హాజరు కావడం లేదు. అంతేకాకుండా తన గైర్హాజరీకి సంబంధించి కారణాలను కూడా ఆయన కోర్టుకు వెల్లడించడం లేదు. దీంతో వంశీపై కోర్టు నాలుగు కేసుల్లోనూ 4 అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మాత్రమే వంశీ సోమవారం కోర్టుకు హాజరైనట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీలో అదికార పార్టీగా ఉన్న టీడీపీతోనే వంశీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. యువకుడు, ఉత్సాహవంతుడిగా ఉన్న వంశీకి చంద్రబాబు తొలిసారే విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన వంశీకి,… ఆ మరుసటి ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. విజయవాడ ఎంపీగా ఓడినా… గన్నవరం ఎమ్మెల్యేగా మాత్రం వంశీ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వంశీ ఉన్నారన్న ధీమాతో ఆ నియోజకవర్గం గురించి టీడీపీ అధిష్ఠానం గానీ, చంద్రబాబు గానీ అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. వంశీ కూడా పార్టీ అధిష్ఠానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి టీడీపీ టికెట్ ఇవ్వడం, వంశీ విజయం సాధించడం అలా రొటీన్ గా జరిగిపోయేవి.
అయితే ఎప్పుడైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ రంగ ప్రవేశం చేసిందో అప్పుడే వంశీకి గ్రహణం పట్టుకుంది. 2014 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రలో భాగంగా విజయవాడకు వస్తే… నాడు వైసీపీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ… జనం మధ్యలో నుంచే వంశీని జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఈ ఘటన నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధిష్ఠానానికి వంశీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వంగవీటి రాధా తనకు మిత్రుడని, తాను అలా వెళుతుంటే… రాధానే తనను పిలిచి తనకు చెప్పాపెట్టకుండానే తనను జగన్ వద్దకు తీసుకెళ్లారని, అసలు జగన్ ను కలవాలని తనకు లేనే లేదని వంశీ చెప్పుకొచ్చారు. అయినా జగన్ ను కలవాల్సిన అవసరం తనకేముందని కూడా వంశీ ప్రశ్నించారు. వెరసి ఈ ఘటనను టీడీపీ అధిష్ఠాం వదిలేసింది. తిరిగి గన్నవరం టికెట్ ను వంశీకే ఇచ్చింది. వంశీ కూడా మరోమారు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలై… వైసీపీ గెలవడం, జగన్ సీఎం కావడంతో వంశీకి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఉన్న తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలను టార్గెట్ చేసిన జగన్… తనను వైసీపీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని టీడీపీ పెద్దల వద్ద వంశీ వాపోయారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి మద్దతు లభించినా…మారిన పరిస్థితుల కారణంగా వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి చేరిపోయారు. ఈ పరిణామం వంశీని టీడీపీకి బద్ధ శత్రువును చేసింది. వంశీ కూడా టీడీపీని తన బద్ధ శత్రువుగా పరిగణించి ఆ పార్టీ నేతలు, ప్రత్యేకించి నారా లోకేశ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిపోయేవారు. ఇలా టీడీపీ, వంశీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారిపోయాయి. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో గన్నవరంలో ఓడిన వంశీ… పూర్తిగా ఆత్మరక్షణలో భాగంగా ఏ ఒక్కరికీ కనిపించకుండా దాదాపుగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయినంత పనిచేశారు. ఏదో తప్పనిసరి అయితే తప్పించి ఆయన బయటకు రావడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఆయన అభిమానులు… టీడీపీని వీడి వంశీ ఎన్నెన్ని కష్టాలు కొని తెచ్చుకున్నాడో కదా అంటూ ఆయన పట్ల జాలిగా చూస్తున్నారు.