గుడివాడలో వైసీపీ రాజకీయాలను జగన్ మార్చేస్తున్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యే కొడాలి నానికి మాత్రం అహంకారం తగ్గడం లేదు. సీఎం జగన్ చేస్తున్న సీట్ల ప్రక్షాళనలో భాగంగా కొడాలి నానికి కూడా గుడివాడ సీటు గల్లంతయ్యేలా కనిపిస్తోంది. తాజాగా గుడివాడలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ విషయానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావు అనే కొత్త వ్యక్తి తెరపైకి వచ్చారు. ఏకంగా వైసీపీ నేతలు ఆయనకే టికెట్ అంటూ.. శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడ పట్టణంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టారు. దీంతో కొడాలి నానికి నిజంగానే ఇక టికెట్ గల్లంతు అనే ప్రచారం ఊపందుకుంది. కొడాలి నాని వ్యవహార శైలితో గతంలో ఆయన బూతుల మంత్రిగా పేరొందిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి ఊడాక కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి గుడివాడ వైసీపీలో కొడాలి నానికి వ్యతిరేకంగా ఓ వర్గం.. ఆయనే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న మరో వర్గం ఉన్నాయి. ఇలా సొంత పార్టీలోనే గందరగోళంగా ఉంది. నానికి తప్ప మరొకరికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆ మధ్య వైసీపీ అధిష్ఠానం పరోక్ష సంకేతాలు ఇచ్చినా కూడా తాజాగా గుడివాడలో పెద్ద ఫ్లెక్సీలు కనిపించాయి. గుడివాడ పోటీకి దిగబోతున్న మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలు చెప్తున్నట్లుగా ఉంది. పట్టణం మొత్తం ఎక్కడ చూసినా ఇవే ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొదటి నుంచి గుడివాడ టికెట్ కొడాలికే ఇస్తారా లేదా అనే ఆసక్తి ఉన్నందున.. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
అయితే, వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎంఓ నుంచి మండలి హనుమంతరావుకు పిలుపు కూడా వచ్చిందని టాక్. వైఎస్ కుటుంబానికి మండలి హనుమంతరావు వీర విధేయుడిగా ఉండేవారట. ప్రస్తుతం ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరోవైపు, వైఎస్ జగన్‌కు నమ్మినబంటుగా, ఆయన్ను ఎవరైనా ఏదైనా అంటే బూతులతో దాడి చేసే నేతగా కొడాలి నానికి పేరుంది. అలాంటి కొడాలికి టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో కొడాలి నాని కూడా తనకు జగన్ టికెట్ ఇవ్వరేమో అనే అనుమానం మొదలైనట్లుగా తెలుస్తోంది. ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి తరహాలోనే తనను కూడా వదిలేస్తారా అనే భావిస్తున్నట్లు సమాచారం.
ఫ్లెక్సీల అంశం తర్వాత కూడా కొడాలి నాని మాత్రం ఆ పౌరుషం, బూతులను ఏ మాత్రం తగ్గించలేదు. మండలి హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నట్లుగా ఫ్లెక్సీలు పెట్టడం.. ఎల్లో మీడియా పని అంటూ ఆ నెపాన్ని వారిపైకి నెట్టారు. సోమవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. పైకి మాత్రం గాంభీర్యాన్నే ప్రదర్శించారు. గుడివాడలో తాను పోటీ చేయాలో లేదో సీఎం జగన్ నిర్ణయిస్తారని అన్నారు. కొంత మంది పకోడి గాళ్లు గుడివాడలో పోటీ చేస్తున్నారని.. తాను కూడా ఫ్లెక్సీ పెడతానని, అది నిజమవుతుందా అని ప్రశ్నించారు. మొత్తానికి నిన్న కొడాలి నాని మీడియాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, ఆయనలో ఆందోళన కనిపిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది











