దుబ్బాక పోరుకు సమయం దగ్గరపడుతోంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ ముఖ్య నేతలు దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ నుంచి ఒంటి చేత్తో హరీష్ రావే అన్నీతానై చూసుకుంటున్నారు. ఇక బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అరవింద్, సోయం బాబురావు, ఇతర ముఖ్య నేతలందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ్మా, వీహెచ్ ఇతర ముఖ్య నేతలు సైతం తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంత మంది నాయకులను దుబ్బాక ఎన్నికల ప్రచారంలో దింపినప్పటికినీ ప్రచారంలో ఎక్కువగా కనబడుతున్నది మాత్రం మంత్రి హరీష్‌రావే. ప్రత్యర్ధి పార్టీలను ధీటుగా ఎదుర్కొంటున్నారు.
ఇచ్చేది 2 రూపాయలే..
పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తూ దుబ్బాకలో రాజకీయ పార్టీలు దుమ్ములేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. కిలో బియ్యంకు 30 రూపాయలను కేంద్రంలో మోడీ ఇస్తున్నారని, కేసీఆర్ ఇచ్చేది మాత్రం 2 రూపాయలే అని ఆరోపించారు. టీఆర్ఎస్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందన్నారు. అమరవీరులు తెచ్చిన తెలంగాణ.. కేసీఆర్ వశమయ్యిందని ఆయన మండిపడ్డారు. బీజేపీ లేకపోతే తెలంగాణ నాడు వచ్చేది కాదన్నారు. దళితున్ని సీఎం చేస్తానని రెండు సార్లు సీఎం కుర్చీలో కేసీఆరే కుర్చున్నారని తెలిపారు. దుబ్బాక ప్రజల తీర్పు కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకుండానే మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్లు వేసుకుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే దుబ్బాకను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.