రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఆడియో లీక్ కావడంతో మంత్రి మల్లారెడ్డికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. గతంలోనూ మల్లారెడ్డిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయమై మల్లారెడ్డి మాట్లాడుతూ ‘ఆడియోలోని మాటలు తనవి కావని, ఆడియో నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని’’ పేర్కొన్నారు. అయినా కూడా విషయం సద్దుమణగలేదు. ఈ వ్యవహారమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మల్లారెడ్డి వెంటనే ముఖ్యమంత్రి కలిసి వివరణ ఇవ్వడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రగతి భవన్ చుట్టు చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సిద్దిపేట పర్యటన ముగించుకొని ఫామ్ హౌస్‌కి వెళ్లారు. అక్కడి నుంచి బుధవారం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. దీంతో మల్లారెడ్డి ఆ రెండు చోట్ల ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా, అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం.
వేటు పడనుందా…?
తనకు మంత్రి పదవి దక్కడంపై మల్లారెడ్డి సన్నిహితుల వద్ద చేసిన కామెంట్లపైనా టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ‘నాకు పోస్టు ఊరికే రాలే.. ముట్టజెప్తేనే వచ్చింది’ అంటూ మల్లారెడ్డి మాట్లాడుతుండటం కూడా టీఆర్ఎస్ అధిష్ఠానం మరింత సీరియఎస్ గా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనూ మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం మల్లారెడ్డి మంత్రి పదవికే గండం తెచ్చేలా కనిపిస్తోంది. నాగార్జున ఉప ఎన్నిక తర్వాత మంత్రి మల్లారెడ్డిపై వేటు పడనున్నట్లు పలు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొన్న అసెంబ్లీ వేదికగా ’’కేసీఆర్ ఒక్కసారి ప్రధాని కావాలి అధ్యక్షా… అంటూ నవ్వులు పూయించాడు. అంతలోనే ఈ ఆడియో వైరల్ అయ్యింది.!!