నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్,సీఐడీ కస్టడీలోనే తనపై భౌతిక దాడి జరిగిందని రఘురామరాజు ఆరోపించడం,దానిని నిర్ధారిచేందుకు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు,ఆపై రమేశ్ ఆస్పత్రిలోనూ వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా రఘురామరాజుకు కేవలం గుంటూరు జీజీహెచ్‌లోనే వైద్య పరీక్షలు చేయించిన సీఐడీ అధికారులు ఆయనను గుంటూరు జైలుకు తరలించడంపై కోర్టు ఆగ్రహం,ఏకంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్,స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలకు కోర్టు ఆదేశం,ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించడం… అంతిమంగా గురువారం రఘురామరాజుకు సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం… మొత్తంగా ఓ పది రోజుల పాటు ఏపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగింది.
వాదనలను పరిశీలిస్తే..
గురువారం సుప్రీంకోర్టులో దాదాపుగా రెండు గంటల పాటు హోరాహోరీగా సాగిన వాదనల తర్వాత సుప్రీంకోర్టు రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై జనంలో నెలకొన్న ఉత్కంఠకు కాస్తంత తెరపడినట్టేనని చెప్పాలి.అయితే ఈ కేసులో అందరికీ అమితాసక్తి కలిగించిన విషయం… రఘురామరాజును సీఐడీ పోలీసులు కొట్టారా? లేదా? అన్నదే.అయితే అనారోగ్య కారణాల ఆధారంగా రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించిన సుప్రీంకోర్టు…రఘురామరాజును సీఐడీ పోలీసులు కొట్టారా? లేదా? అన్న విషయాన్ని మాత్రం తేల్చలేదనే చెప్పాలి.మరి ఈ విషయం తేలేదెలా?గురువారం నాటి విచారణ సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు తమదైన రీతిలో హోరాహోరీగా వాదనలు వినిపించారు.ఈ వాదనలను ఓ సారి నిశితంగా పరిశీలిస్తే… రఘురామరాజుపై భౌతిక దాడి జరిగినట్టేనన్న వాదనలు బలపడక మానవు.
కాలి వేలికి గాయం
అదెలాగంటే… రఘురామరాజుపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదని వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ…రాజకీయ కక్షతోనే ఆయనపై జగన్ సర్కారు కేసులు నమోదు చేసిందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఆ కేసులను రద్దు చేయడంతో పాటుగా రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేయాలని కూడా ఆయన కోర్టును విన్నవించారు.ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధపడ్డ జగన్ సర్కారు తరఫు న్యాయవాది దుష్యంత్ దవే…పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు.అంతకుముందు రఘురామరాజుకు చేసిన వైద్య పరీక్షల నివేదికను, ఆర్మీ హాస్పిటల్ తమ నివేదికను తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు అందజేసింది.ఈ నివేదికను విచారణ సందర్భంగా చదివిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి… రఘురామరాజుకు ఎడిమా వ్యాధి ఉందని,అదే సమయంలో ఆయన కాలి వేలికి గాయమైందని తెలిపారు.దీంతో సీఐడీ కస్టడీలో ఉండగా రఘురామరాజుపై భౌతిక దాడి జరిగినట్టేనన్న వాదనలు వినిపించాయి.
అనుమానించాల్సిన విషయమంటూ..
అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించిన దుష్యంత్ దవే.. గుంటూరు జీజీహెచ్‌లో జరిపిన పరీక్షల్లో రఘురామరాజుకు ఎలాంటి గాయాలు లేవని తేలిందని తెలిపారు.అయితే ఆర్మీ ఆస్పత్రి పరీక్షల్లో కాలి వేలికి గాయముందని తేలిందన్నారు. రెండు నివేదికలను తాము తప్పుబట్టడం లేదంటూనే…అసలు రఘురామరాజుకు ఆ గాయం ఎలా అయ్యిందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.అంతటితో ఆగని దవే… గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించే సమయంలో రఘురామరాజును అంబులెన్స్‌లో తరలించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. అయితే అందుకు సమ్మతించని రఘురామరాజు.. తన సొంత కారులోనే వస్తానంటూ బీష్మించారని,చివరకు అందుకు సీఐడీ పోలీసులు అనుమతించారన్నారు.గుంటూరు జీజీహెచ్ వైద్య పరీక్షల్లో కనిపించని గాయం… సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట్ పరీక్షల్లో బయటపడిందంటే… అందులో ఏదో అనుమానించాల్సిన విషయం ఉందని పేర్కొన్నారు.
సొంతంగా చేసుకుని ఉండవచ్చంటూ..
ఇదే విషయంపై సుప్రీం ధర్మాసనం గాయం ఎలా అయ్యిందని ప్రశ్నించగా…రఘురామరాజే తన సొంతకారులో కూర్చున్నప్పుడు చేసుకుని ఉండవచ్చంటూ దుష్యంత్ దవే తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.సీఐడీ పోలీసులు ప్రతిపాదించినట్లుగా అంబులెన్స్‌లో వచ్చి ఉంటే రఘురామరాజుకు ఏమైనా పోలీసులదే బాధ్యత అని,అదే రఘురామరాజు సొంత కారులో ప్రయాణిస్తే …ఏమైనా జరిగి ఉండవచ్చన్న కోణంలో దవే ఆసక్తికర వాదన వినిపించారు. మొత్తంగా రఘురామరాజు కాలికి గాయమైన విషయాన్ని జగన్ సర్కారు న్యాయవాది కూడా ఒప్పుకోవడం,దానిని కప్పిపుచ్చుకునేలా తనదైన శైలి వాదనలు వినిపించడం,రఘురామరాజుకు గాయమెలా అయ్యిందంటూ కోర్టు ప్రశ్నించడం చూస్తుంటే…సీఐడీ కస్టడీలో ఉండగానే రఘురామరాజుపై దాడి జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారికంగా ఎప్పుడు ప్రకటన వెలువడుతుందో చూడాలి.
Must Read ;- రఘురామరాజుకు బెయిల్ ఇప్పించింది జగన్ లాయరే..!











