దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరం రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించాయి. ఆ వివరాల ప్రకారం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా ఏడో ఏడాది అత్యధిక విరాళాలు రాబట్టుకోగా కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఇక ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్కు అధికంగా విరాళాలు వచ్చాయని చెప్పవచ్చు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏడేళ్లుగా విరాళాలు పొందడంలోనూ అగ్రగామిగానే ఉంది. ఈ పార్టీకి గత ఆర్థిక సంవత్సరం వచ్చిన విరాళాలు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాల కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
బీజేపీకి రూ.785.77 కోట్ల విరాళాలు
బీజేపీకి వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి రూ.785.77 కోట్ల విరాళాలు అందాయి. బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌కు చెందిన ఫండింగ్ కన్సార్టియం జూపిటర్ క్యాపిటల్, ఐటీసీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్, జిఎంఆర్ ఎయిర్ పోర్టు డెవలపర్స్ ఇతర బడా కార్పోరేట్ సంస్థలతో కూడిన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రూ.217 కోట్లు విరాళంగా అందగా జెఎస్‌డబ్ల్యు గ్రూపు ఆధ్వర్యంలోని జన్ కల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రూ.45.95 కోట్లు అందాయి. హిందాల్కోకు చెందిన సమాజ్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.3.75 కోట్లు, ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.9 కోట్లు విరాళంగా ఇచ్చారు. నిబంధనల ప్రకారం రూ.20వేల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లను ఎన్నికల సంఘానికి పార్టీలు తెలియజేయాల్సి ఉంది. అంతకంటే తక్కువగా వచ్చిన విరాళాలను కూడా లెక్కిస్తే ఈ విరాళాలు మరింత పెరగనున్నాయి.
కాంగ్రెస్‌కు రూ.139.01 కోట్లు
ఇతర పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్‌కు రూ.139.01 కోట్ల విరాళాలు వచ్చాయి. అందులో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ.58 కోట్లు ఉన్నాయి. సీపీఎంకి రూ.19.69 కోట్లు, CPIకి రూ.1.29కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు 8.08 కోట్ల విరాళాలు అందాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శరద్ పవార్‌కి చెందిన ఎన్‌సిపికి రూ.59.94 కోట్లు వచ్చాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి రూ.130.46కోట్ల విరాళం రాగా, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీకి రూ. 111.4కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి రూ.92.7 కోట్లు విరాళాలు దక్కగా, ఒడిశా అధికార పార్టీ బీజూ జనతాదల్ (బీజేడీ)కి రూ.90.35 కోట్లు, తమిళనాడులో ఇటీవలి వరకు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకేకు రూ.89.6 కోట్లు, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీగా ఉన్న డీఎంకేకు రూ.64.90 కోట్లు విరాళాలు అందాయి. కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా బీజేపీకి రూ.472 కోట్ల విరాళాలు రాగా కాంగ్రెస్‌కు రూ.99 కోట్ల విరాళాలు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా యూపీలో కీలకలమైన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) ఎలాంటి విరాళాలు రాలేవని చెప్పింది.
పెరిగిన బీజేపీ ఆస్తులు
కాగా గతంలో పార్టీలకు సంబంధించి ఆస్తుల వివరాలు కూడా వెల్లడయ్యాయి. దేశంలోని జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆస్తుల విలువ (2018-19నాటికి) రూ.7,372కోట్లుగా తేలింది. అందులో బీజేపీ రూ.2904కోట్ల విలువైన ఆస్తులు చూపెట్టగా కాంగ్రెస్ పార్టీ రూ.928కోట్ల విలువైన ఆస్తులున్నాయని ప్రకటించింది. తరువాతి స్థానంలో బీఎస్పీ రూ.738కోట్లు, సమాజ్ వాదీ పార్టీ రూ.572కోట్లు, బీజేడీ రూ.232.27కోట్లు, ఏఐఏడీఎంకే రూ.206కోట్ల విలువైన ఆస్తులున్నాయి. జాతీయ పార్టీల జాబితాలో సీపీఐకి అతి తక్కువగా రూ.24.8కోట్ల ఆస్తులుండగా ఎన్సీపీ కి రూ.31కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడింది. తాజా విరాళాల నిష్పత్తి ప్రకారం చూస్తే బీజేపీ ఆస్తులు భారీగా పెరుగుతాయనే చర్చ నడుస్తోంది.
Must Read ;- పైన పవర్ ఉన్నా లోకల్ టాలెంట్ నిల్.. టర్నింగ్‌లతో ఏపీలో కమలం బర్నింగ్