కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాహుల్ గాంధీని బీజేపీ ఇప్పటికే అష్టదిగ్బంధనం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతో ఉందని, దాదాపు పాతాళానికి పడిపోయిందని అడుగడుగునా విమర్శిస్తోంది. వారి విమర్శలు పక్కన బెడితే ..కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలూ అలాగే ఉన్నాయి. ఇక తాజాగా బీహార్ ఫలితాలూ బీజేపీకి సానుకూలంగా వచ్చాయి. కూటమిగా పోటీచేసినా..కాంగ్రెస్ పార్టీ మాత్రం లబ్ధి పొందలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన క్షణంనుంచి ఆ పార్టీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోలదని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బకు విలవిలలాడిన పరిస్థితి కనిపించింది. రాజస్థాన్ లో అధికారాన్ని కాపాడుకోగలిగినా.. అతి కష్టం మీద లాక్కొచ్చింది. ఇక జ్యోతిరాధిత్య సింధియాలాంటి వాళ్లు పార్టీని వీడకుండా ఆపలేకపోయింది. రానున్న కాలంలో బీజేపీ వీటిని ఎత్తిచూపి..కాంగ్రెస్ పార్టీని మరింత డీమోరల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే టైంలో యువనాయకులను బీజేపీ తెరపైకి తెస్తోంది. కాంగ్రెస్ లో ఆ స్పీడ్ కరవైంది. ఇది చాలదన్నట్లు తాజాగా బీజేపీకి ఒబామా రూపంలో మరో అస్త్రం దొరికింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్ ’ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై, మన్మోహన్ సింగ్ పై, సోనియాగాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ పుస్తకంలో రష్యా అధినేత వ్లాద్ మిర్ పుతిన్ తోపాటు పలువురు విదేశీ నేతలపైనా వ్యాఖ్యలు చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
- రాహుల్ గాంధీకి ఒక బలహీనత ఉంది. ఆయన ఓ విద్యార్థిలా వ్యవహరిస్తున్నాడు. కోర్సు మొత్తం పూర్తి చేసి టీచర్‌ను ఆకట్టుకోవాలని తాపత్రయ పడుతుంటాడు. కాని విషయంపై అధ్యయనం చేయడు. లోతుగా ఆలోచించడు. అందుకు గాను ఆయనలో ఏ విధమైన అభిరుచి, ఆసక్తి కనిపించవు.
- “చార్లీ క్రిస్ట్, రహమ్ ఇమాన్యుయేల్ వంటి పురుషుల అందం గురించి మనకు తెలుసు. కానీ మహిళల అందం గురించి చెప్పలేదు. సోనియా గాంధీ విషయంలో కూడా అదే కనిపించింది అని నెగెటీవ్ కామెంట్ చెప్పారు.
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి అస్పష్టమైన అంశాల్లో చిత్త శుద్ధి ఉంటుంది అని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన నాటినుంచి భారతీయుల్లో చాలా మంది ఒబామాకు ఫాలోవర్లుగా మారారు. ఆయన మాటను గౌరవించేవారు లక్షల్లో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా పేరున్న ఒబామా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను మరింత ఇబ్బంది పెట్టేవిగా కనిపిస్తున్నాయి. బీజేపీకి కొత్త అస్త్రంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మూల స్తంభాలుగా ఉన్న వ్యక్తులపై ఒబామా చేసిన కామెంట్లను ఇప్పటికే బీజేపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ వైపునుంచి ఒబామా కామెంట్లను ఖండిస్తూ నేతలు మాట్లాడుతున్నా.. అది ప్యాచ్ వర్క్ లాగానే కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటికే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ పప్పు అని విమర్శిస్తున్న వారికి మరో ఆయుధాన్ని ఒబామా ఇచ్చారని చెప్పవచ్చు. మరి దీన్ని శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా డీల్ చేస్తుందనేది చూడాలి.