టాలీవుడ్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వి.వి.వినాయక్, మాస్ ఇమేజ్ కోసం తన కెరీర్ బిగినింగ్ నుంచి ప్రయత్నిస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్… ఈ ఇద్దరూ కలిసి తొలిసారి బాలీవుడ్ లో తమ అదృష్ణాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. దానికోసం రాజమౌళి ల్యాండ్ మార్క్ మూవీ ‘ఛత్రపతి’ని రీమేక్ చేయబోతున్నారని కూడా అందరికీ తెలుసు. టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘అల్లుడు శ్రీను’ మూవీ తో హీరోగా పరిచయం చేసిన వినాయకే.. అతడ్ని బాలీవుడ్ తెరకు కూడా హీరోగా పరిచయం చేయబోతుండడం ఆసక్తిగా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో కథానాయికగా ‘భరత్ అనే నేను’ లో మహేష్ బాబు తో అత్యంత సుందరంగా రొమాన్స్ చేసిన కియారా అద్వానీ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో ఆ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రతీ సినిమాలోనూ క్రేజీ హీరోయిన్స్ ను ఎంపికచేసుకొనే బెల్లంకొండ హీరో .. హిందీలో కూడా ఓ క్రేజీ గాళ్ ను సెలెక్ట్ చేసుకోవడం విశేషంగా మారింది. ‘ఛత్రపతి’లో శ్రియా శరణ్ చేసిన గ్లామరస్ రోల్ కియారాకు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి కియారా స్ర్కీన్ ప్రెజెన్స్ హిందీ ఛత్రపతికి ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.











