వైసీపీ..చీప్ టెక్నిక్‌లకు, ప్రాపగాండకు కేరాఫ్ అడ్రస్.. తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే, ఆ పార్టీని ఫేక్ పార్టీ అని అభివర్ణించారు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఫేక్ ఎజెండాలో భాగంగా కూటమిలో విబేధాలున్నాయని అడ్డగోలు కథనాలు ప్రచారం చేస్తోంది ఆ పార్టీ. ఇప్పుడు వైసీపీ మిషన్ అంతా కూటమి నుంచి పవన్‌కల్యాణ్‌ను తప్పించడమే. దీనికోసం గోతికాడినక్కలా ఆ పార్టీ వేచి చూస్తోంది. తప్పుడు కథనాలతో కూటమిలోని కింది స్థాయి క్యాడర్‌ను గందరగోళంలో పడేయాలనేది వైసీపీ పార్టీ, దాని అనుబంధ మీడియా ప్లాన్.
తాజాగా సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మధ్య విబేధాలంటూ ఓ కథనాన్ని వండి వార్చింది. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే పవన్‌కల్యాణ్ స్పందించలేదంటూ ఓ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాదెండ్లతో మనోహర్‌తో చెప్పారని అసత్య ప్రచారం చేసింది.
నిజానికి ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌కు పవన్‌కల్యాణ్ దూరంగా ఉన్నారు. అందుకు గల కారణాలను సైతం ఆయన ముందుగానే చెప్పారు. తీవ్రమైన జ్వరం, నడుం నొప్పి కారణంగా వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించరు. ఐనప్పటికీ బ్లూమీడియా అబద్ధపు కథనాలను ప్రచారం చేసింది. ఇక ఇప్పుడు కోలుకోవడంతో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దక్షిణాదిన యాత్రకు బయల్దేరారు పవన్‌కల్యాణ్.
నిజానికి కూటమిలో విబేధాలంటూ ప్రచారం చేయడం వైసీపీకి ఇది మొదటి సారి కాదు. ఎన్నికల ముందు కూటమిలో సీట్ల పంపకాల నుంచి, అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఇదే చీప్ ట్రిక్ ఫాలో అవుతోంది. పవన్‌ను తక్కువ చేసేందుకు లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారంటూ అబద్ధపు ప్రచారాలు చేసింది. ఐతే వైసీపీ కుట్రలకు ఎప్పటికప్పుడు కూటమి నేతలు చెక్ పెడుతున్నారు. జనాలు కూడా బ్లూ మీడియా కథనాలను నమ్మే స్థితిలో లేరు. డిప్యూటీ సీఎం అంశంపై లోకేష్ వివిధ సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. తనకు డిప్యూటీ సీఎం పదవిపై ఎలాంటి ఆశ లేదని, ఇప్పుడున్న బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. ఇక పవన్‌కల్యాణ్ సైతం మరో 15 ఏళ్లు కూటమిలో ఉండడానికి తాను సిద్ధమేనన్నారు. చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వం ఏపీకి ఎంతో అవసరమని చాలా సందర్భాల్లో చెప్పారు. ఐతే ఈ విషయం వైసీపీకి మింగుడుపడడం లేదు.
ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కూటమిలో విబేధాలేమో కానీ..వైసీపీ జనాలకు మరింత దూరమవుతోంది. ఇప్పటికే ఫ్యాన్ పార్టీ హైకమాండ్ తీరుపై పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. జగన్ తీరులో మార్పు రాకపోతే వైసీపీకి భవిష్యత్ లేకుండా పోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.