పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఒక భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మొఘల్ చక్రవర్తుల కాలంనాటి కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో పవన్ ఓ వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. ఆయన పాత్ర పేరు ‘వీరమల్లు’ అని తెలుస్తోంది. మొఘల్ చక్రవర్తుల అధీనంలో ఉన్న కోహినూర్ వజ్రంపై ఈ వీరమల్లు కన్ను పడుతుంది. అప్పటి నుంచి ఆయన ఆ వజ్రాన్ని దొంగిలించడానికి ఎలా ప్రయత్నించాడనే కథాకథనాలతో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ‘అర్జున్ రామ్ పాల్’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
మొఘల్ చక్రవర్తుల నేపథ్యంలో .. ఔరంగకేబు కాలంలో ఈ కథ నడుస్తుంది. అందువలన ఔరంగజేబు పాత్ర కూడా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ కారణంగానే ఈ పాత్ర కోసం ‘అర్జున్ రామ్ పాల్’ ను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. క్రిష్ కి మొదటి నుంచి బాలీవుడ్ తో మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఆయన అర్జున్ రామ్ పాల్ ను తేలికగానే ఒప్పించాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హిందీలో విడుదల చేసే ఆలోచన ఉండటం కూడా మరో కారణమని చెబుతున్నారు.
భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ నే పరిశీలించారు. చివరికి ‘హరహర మహాదేవ’ అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో జాక్విలిన్ మెరవనుంది. పవన్ చేస్తున్న తొలి చారిత్రక చిత్రం కావడంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమా సంచలనాన్ని సృష్టించడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.