ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’పేరిట ప్రసారమయ్యే కార్యక్రమానికి ఏ మేర క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రజ్యోతి ఎండీ హోదాలో ఉన్న వేమూరి రాధాకృష్ణ.. ఈ ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్‌గా తన పాత ఉద్యోగంలోకి మారిపోయి.. కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులను తనదైన శైలి ప్రశ్నలతో సతమతం చేస్తున్న వైనం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా నాన్ స్టాప్‌గా సాగిన ఈ కార్యక్రమంలో దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆర్కే.. తాజాగా ఓ నెల క్రితం మూడో సీజన్‌ను మొదలెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో తొలి ఇంటర్వ్యూలోనే ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఇంటర్వ్యూ చేసిన ఆర్కే.. తనదైన మార్కును చూపారు. ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను కూడా ఇంటర్వ్యూ చేసిన ఆర్కే.. తాజాగా ఆదివారం నాడు మాజీ పోలీసు అధికారి, బీఎస్పీ తెలంగాణ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారు.
ఆర్ఎస్‌ది ఓ విభిన్న ప్రస్థానం
దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్థానం నిజంగానే విభిన్నమైనదని చెప్పక తప్పదు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన ఆర్ఎస్.. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్‌లో సత్తా చాటి ఐపీఎస్ అధికారిగా ఎన్నికయ్యారు. పోలీసు అధికారిగా తనకంటూ ఓ ప్రత్యేక మార్కును క్రియేట్ చేసుకున్న ఆర్ఎస్.. ఆ తర్వాత ఏ ఒక్క ఐపీఎస్ అధికారికీ సాధ్యం కాని రీతిలో గురుకుల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఐఏఎస్ అధికారులు మాత్రమే నిర్వహించే ఈ బాధ్యతలను ఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ సర్కారుతో బతిమాలి మరీ దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన పనితీరు చూసిన కేసీఆర్.. ఆయనను అక్కడి నుంచి తప్పించలేకపోయారు. ఏమైందో తెలియదు గానీ.. ఆరేళ్ల సర్వీసు ఉన్న సమయంలో ఉన్నట్లుండి ఐపీఎస్ సర్వీసుకు వాలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చేసిన ఆర్ఎస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నిత్యం వాస్తవిక దృక్పథంతోనే సాగే ఆర్ఎస్.,. ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ కో ఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు. దళితుల అభ్యున్నతి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే ప్రవీణ్.. ఆ దిశగా ఏ మేర విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నీ చెప్పేసినట్టే..!
ఆర్ఎస్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న ఆర్కే ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైపోయింది. ఈ ప్రోమోను చూస్తుంటే.. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నింటినీ ప్రవీణ్ కుమార్ ఏమాత్రం మొహమాటం లేకుండానే విప్పి చెప్పినట్టుగానే తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత రాజకీయాలు సాగుతున్న తీరు, వీటిలో తాను ఇమడగలనా? అన్న విషయాలను కూడా ఆయన చెప్పినట్లుగానే తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థి దశలో తాను ఎదుర్కొన్న కుల వివక్షను, అగ్ర కుల అహంకారాన్ని కూడా ఆర్ఎస్ నుంచి ఆర్కే రాబట్టినట్టుగానే తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఓ భారీ మార్పునకు శ్రీకారం చుట్టే దిశగా సాగుతున్నానని చెబుతున్న ఆర్ఎస్.. ఆర్కే ప్రశ్నలకు తన భవిష్యత్తు కార్యాచరణను సమూలంగా బయటపెట్టారా? లేదంటే అలా.. అలా చెప్పేసి వెళ్లిపోయారా? అన్న అంశపై ఆసక్తి నెలకొంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.











