వేణుంబాక విజయసాయిరెడ్డి.. మొన్నటిదాకా ఓ చార్టెర్డ్ అకౌంటెంట్‌గా జనాలకు ముఖం చూపే అవకాశం లేని వృత్తిలో సాగిపోయారు. ఎప్పుడైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందో.. ఒక్కసారిగా సాయిరెడ్డి పేరు మారుమోగిపోయింది. జగన్‌పై నమోదైన అన్ని కేసుల్లోనూ సాయిరెడ్డే రెండో నిందితుడిగా ఉన్నారు. వెరసి ఒక్కసారిగా ఆయనకు సెలబ్రిటీ హోదా వచ్చేసింది. ఇదే అదనుగా సాయిరెడ్డి కూడా ఇకపై కూడా జనానికి ముఖం చూపించాల్సిన అవసరం లేని అకౌంటెంట్ వృత్తిని వద్దనుకున్నారు. తన సేవలతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోయిన జగన్ వెంటే సాగాలని నిర్ణయించుకున్నారు. సాయిరెడ్డి కోరంగానే.. తన పార్టీలో ఏకంగా తన తర్వాతి స్థానాన్ని ఇచ్చేసిన జగన్.. సాయిరెడ్డికి ఏకంగా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించేశారు. అంతేనా.. పార్టీకి దక్కిన తొలి రాజ్యసభ స్థానాన్ని కూడా సాయిరెడ్డికే జగన్ కట్టబెట్టేశారు. అంతేకాదండోయ్.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగానూ ఇప్పుడు సాయిరెడ్డి పెద్ద పదవిని కొట్టేశారు. మరి ఇన్ని పదవులు ఇచ్చిన జగన్‌కు సాయిరెడ్డి ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే కాబోలు.. ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతూ వ్యవస్థలన్నింటినీ తమకు అనుకూలంగా మలిచే పనిలో సాయిరెడ్డి నిమగ్నమయ్యారు. మొన్నటిదాకా పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు సాయిరెడ్డి చక్రం బాగానే తిరుగుతోందట. ఓ డిక్టేటర్ స్థాయిలో సాయిరెడ్డి దర్యాప్తు సంస్థలు తన కనుసన్నల్లో నడిచేలా తనదైన శైలి మంత్రాంగాన్ని నడిపిస్తున్నారట.
ఇవన్నీ సొంత పార్టీ ఎంపీ మాటలే
సాయిరెడ్డి డిక్టేటర్‌గా మారిపోయిన వైనాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీనో, లేదంటే జనసేననో, మరీ లేదంటే బీజేపీనో, అదీ కాదంటే వామపక్షాలో బయటపెట్టలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పైనే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలో వైసీపీకి అనుకూలంగానే ఉన్నా.. కాలక్రమంలో జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా రఘురామరాజు వైసీపీకి బద్ధ విరోధిగా మారిపోయారు. రఘురామ నోటిని నొక్కేందుకు వైసీపీ సర్కారు సొంత పార్టీ ఎంపీ అన్న విషయాన్ని పక్కనపెట్టి మరీ అరెస్ట్ చేయించింది. పోలీసుల కస్టడీలో థర్డ్ డిగ్రీనీ ప్రయోగించింది. ఫలితంగా దేశ రాజకీయాల్లో ఓ విలనీగా వైసీపీ నిలిచిపోయింది. నాటి నుంచి వైసీపీపై మరింత మేర ఫోకస్ పెట్టిన రఘురామ.. ఢిల్లీలో సాయిరెడ్డి సహా వైసీపీ ఎంపీల కదలికలపై మరింత నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు వైసీపీ దమన నీతిపై తనదైన శైలి వాగ్బాణాలను విసురుతూనే ఉన్నారు. వైసీపీ జమానాలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో కూడా విడమరిచి చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో వైసీపీనే ఈ దఫా రఘురామకు సాయిరెడ్డిని అడ్డంగా బుక్ చేసి పారేసింది. జగన్, సాయిరెడ్డిలపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వారి తరఫున వాదనలు వినిపించిన సుభాష్ అనే న్యాయవాదిని సీబీఐ తన స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించుకుంది. ఈ పరిణామంపై కాస్తంత లోతుగా ఆరా తీసిన రఘురామ ఢిల్లీలో సాయిరెడ్డి ఎలా చక్రం తిప్పుతున్నారో శనివారం నాడు బట్టబయలు చేశారు.
రఘురామ ఏమన్నారంటే..?
అక్రమాస్తుల కేసులో జగన్, సాయిరెడ్డిల తరఫున సీబీఐ కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది సుభాష్‌ను సీబీఐ తన స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించుకున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామకృష్ణరాజు శనివారం నాడు సీబీఐ డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఏమంటారంటే.. ‘‘జగన్ అక్రమాస్తుల కేసును వాదించిన న్యాయవాది సుభాష్. జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య సహా పలు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అలాంటప్పుడు సుభాష్‌ను తన స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించుకోవడం ద్వారా సీబీఐ విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం కౌన్సిల్ న్యాయవాదిగా సుభాష్‌ను తొలగించండి. అనుభవం ఉన్న మరో సీనియర్ న్యాయవాదిని నియమించండి’’అని ఆ లేఖలో రఘురామరాజు సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేసిన సందర్భంగా రఘురామ మరింత సంచలన వ్యాఖ్యలను చేశారు. సీబీఐలో ఏ ఆఫీసర్ ఎక్కడ ఉండాలో సాయిరెడ్డి నిర్దేశిస్తున్నారని రఘురామ ఆరోపించారు. సీబీఐ, ఈడీ అధికారులతో సాయిరెడ్డి నిత్యం మంతనాలు సాగిస్తున్నారని.. సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్‌గా సుభాష్ నియామకం వెనుక సాయిరెడ్డి పాత్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో అనుకూల అధికారుల నియామకం జరిగేలా సాయిరెడ్డి చూస్తున్నారని, తద్వారా తనతో పాటు జగన్ కూడా ఈ కేసుల నుంచి బయటపడేలా సాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
Must Read ;- సాయిరెడ్డిని కడిగేసిన ఖాకీ!