హైదరాబాద్ వాసులకు ఇది నిజంగా శుభవార్తే. త్వరలో హైదరాబాద్ నగరానికి బుల్లెట్ ట్రైన్ రానుంది. దీనికి సంబంధించిన పనులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ నగరవాసులకు ఇప్పటికే ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక బుల్లెట్ ట్రైన్ సేవలు కూడా నగరవాసుల చెంతకు రానున్నాయి. త్వరలో నగరానికి బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. ప్రధాన నగరాలకు అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టు దిశగా అడుగులు పడుతున్నాయి. 711 కిలోమీటర్లతో హైదరాబాద్-పుణె-ముంబాయి మార్గంలో బుల్లెట్ రైళ్లు త్వరలో తిరగనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే గనుక కేవలం గంటల వ్యవధిలోనే మూడు నగరాలకు రాకపోకలను సాగించే వీలుంటుంది. వచ్చే ఏడాదిలో పనులు ప్రారంభించి ఐదేళ్లలో బుల్లెట్ ట్రైన్ పనులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తున్నది.
దేశవ్యాప్తంగా మొత్తం ఏడు మార్గాల్లో బుల్లెట్ కారిడార్లు తీసుకొచ్చేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో ప్రధానమైన మార్గం హైదరాబాద్-పుణె-ముంబాయి. ఈ పనులకు నవంబర్11న టెండర్లను కేంద్ర ప్రభుత్వం పిలవనుంది. అదే నెలలో పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వ్యాపార, వాణిజ్య పరంగా హైదరాబాద్-పుణె-ముంబాయి బుల్లెట్ ట్రైన్ మార్గం ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఉన్న ట్రాకుల సామర్థ్యం బుల్లెట్ ట్రైన్ స్పీడుకు తట్టుకునేలా లేవు. 80 నుంచి 160 కిలోమీటర్ల వేగానికి సరిపడే ట్రాకులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. ఈ ట్రాకులపై బుల్లెట్ ట్రైన్ వెళ్తే తట్టుకోలేవు. దాంతో బుల్లెట్ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాకులను వేయనున్నారు. బుల్లెట్ ట్రైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)పై చర్చించేందుకు నవంబర్ 5న అధికారుల సమావేశాన్ని హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనున్నది. ఈ సమావేశంలో ప్రాజెక్టుపై అనేక విషయాలను చర్చించనున్నారు.
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా అందుబాటులోకి వస్తే పుణె, ముంబాయి, ఢిల్లీ ఇతర నగరాలకు ప్రయాణం సులభతరం కానుందని నగరవాసులు అంటున్నారు.











