విజయవాడ-గుంటూరు మధ్య చినకాకాని పరిధిలో 18 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎన్నారై ఆసుపత్రిలో గడచిన రెండు రోజులుగా తీవ్ర అలజడి నెలకొంది. మరికొన్ని రోజులు కూడా ఈ తరహా అలజడి మరింతగా ఉధృతమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఈ మొత్తం వ్యవహారానికి ఆసుపత్రితో ఎంతమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తే కారణమని తేలిపోయింది. ఆ వ్యక్తి మరెవరో కాదు… సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇటీవలి కాలంలో అత్యంత సన్నిహితుడిగా మారిపోయిన మేఘా కృష్ణారెడ్డే. ఇంజినీరింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కృష్ణారెడ్డి… తాను నెలకొల్పిన సంస్థ మేఘా పేరును ఇప్పుడు తన పేరుకు ముందు పెట్టేసుకున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ కీలక వ్యక్తిగా మారిపోయిన మేఘా కృష్ణారెడ్డి… అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా మారిపోతారు. ఇలాంటి వైఖరితోనే ఇప్పటికే చాలా వ్యాపారాల్లో తనకు ఎదురే లేదని నిరూపించుకున్న కృష్ణారెడ్డి… ఏపీకి సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి కాస్తంత ముందుగా ఎన్నారై ఆసుపత్రిపై కన్నేశారట. ఇంకేముంది… నయానో, భయానో ఆ ఆసుపత్రిని తన చేతికిందకు తెచ్చుకునేందుకు కృష్ణారెడ్డి చేయని యత్నమంటూ లేదంటే అతిశయోక్తి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పుట్టిన గడ్డకు సేవలందించేందుకే ఎన్నారై
విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు… తమ సొంత గడ్డ అయిన తెలుగు నేల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 18 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా పరిధిలోని చినకాకానిలో ఎన్నారై ఆసుప్రతి పేరిట వైద్య శాలను ఏర్పాటు చేశారు. వారు అనుకున్నట్లుగానే తెలుగు నేల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అంచెలంచెలుగా వైద్య కళాశాలగానూ మారిపోయింది. వైద్య సంబంధిత అన్ని కోర్సులనూ ఆ సంస్థ నడుపుతోంది. మొన్నటిదాకా ఆసుపత్రి నిర్వహణలో యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కార్పొరేట్ రంగమంటేనే బయటకు కనిపించని కుయుక్తులతో కూడుకున్నది కదా. నానాటికి తనదైన సేవలను విస్తరిస్తూ పోతున్న ఎన్నారై ఆసుపత్రిని హస్తగతం చేసుకునేందుకు ఇప్పటికే పలువురు కార్పొరేట్ ప్రముఖులు యత్నించారు. వీరిలో లింగమనేని రమేశ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఆ సందర్భంగా ఉమ్మడిగా గట్టిగా నిలబడిన ఆసుపత్రి డైరెక్టర్ల బోర్డు లింగమనేని నుంచి ఆసుపత్రిని కాపాడుకుంది.
ఎన్నికలకు ముందే వ్యూహ రచన
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా.. ఎన్నికల ఫలితాలను అంచనా వేశారో, ఏమో తెలియదు గానీ.. ఆసుపత్రిపై మేఘా కన్ను పడింది. అంతే డైరెక్టర్ల బోర్డులో తనకు లొంగే వారెవరున్నారా? అన్న దిశగా చూసిన కృష్ణారెడ్డి… ఓ సారి డైరెక్టర్ల బోర్డుతోనే మాట్లాడితే పోలా అన్న కోణంలో ఆలోచించారు. డైరెక్టర్ల బోర్డుతో భేటీ అయ్యారు. ఆసుపత్రిని తాను టేకోవర్ చేస్తానని, ఆసుపత్రిని మరింత మేర అభివృద్ధి చేస్తానని కృష్ణారెడ్డి చెప్పి ఉంటే.. డైరెక్టర్ల బోర్డు కూడా అంగీకరించి ఉండేదేమో. అయితే అందుకు భిన్నంగా తనదైన శైలి బెదిరింపు ధోరణిలో డైరెక్టర్ల బోర్డును దబాయించేందుకు యత్నించారు. అయితే డైరెక్టర్ల బోర్డులో ఉన్నవాళ్లంతా తమ రంగంలో ఆరితేరిన వారు కదా. కృష్ణారెడ్డి బెదిరింపులకు లొంగలేదు. ఆసుపత్రిని తామే నిర్వహిస్తామని, తమకు ఎవరి సహకారం అవసరం లేదని తేల్చి చెప్పేశారు. దీంతో అహం దెబ్బ తిన్నవాడిలా కృష్ణారెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత నుంచే ఎలాగైనా ఎన్నారై ఆసుపత్రిని హస్తగతం చేసుకోవాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏపీకి సీఎంగా తన సామాజిక వర్గానికి చెందిన జగన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఆయనకు మరింత బలాన్నిచ్చినట్టైంది.
నలుగురు డైరెక్టర్లను వలలో వేసుకుని…
తన పథకానికి పదును పెట్టిన కృష్ణారెడ్డి.. డైరెక్టర్ల బోర్డులోని కొందరిని లొంగదీసుకునేందుకు ఎప్పటికప్పుడు యత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ల బోర్డులోని ఓ నలుగురు ఆయన వలలో పడిపోయారు. అంతే…ఇక ఏమాత్రం ఆసల్యం చేయకుండా రంగంలోకి దిగిపోయిన కృష్ణారెడ్డి… ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని…గతంలో పోలీసులకు అందిన చిన్న ఫిర్యాదును ఆధారం చేసుకుని తన వ్యూహానికి పదును పెట్టారు. ఎలాగూ తనకు అనుంగుడిగా మారిపోయిన కృష్ణారెడ్డి అడిగిందే తడవుగా జగన్ కూడా ఈ వ్యూహానికి సరేననడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎప్పుడో అందిన ఫిర్యాదును పట్టుకుని, కొత్తగా కృష్ణారెడ్డి వైపు తిరిగిన నలుగురు డైరెక్టర్లు చేసిన ఫిర్యాదును చేతబట్టుకుని ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన పోలీసులు… నగులురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ నలుగురు వ్యక్తులకు మద్దతుగా బోర్డులోని మిగిలిన డైరెక్టర్లంతా నిలవడంతో తన వలలో పడిన నలుగురు డైరెక్టర్లతో ఏకంగా బోర్డునే చీల్చేశారు. వెరసి ఎన్నారై ఆసుపత్రిలో అలజడి మొదలైపోయింది.
బోర్డునే చీల్చేశారు!
ఆసుపత్రి హస్తగతం చేసుకునేందుకు కృష్ణారెడ్డి జెట్ స్పీడుతో వెళుతుంటే… దానిని అడ్డుకునేందుకు డైరెక్టర్ల బోర్డు రంగంలోకి దిగింది. గురువారం నాడు బోర్డు మీటింగ్ జరగగా.. దానికి హాజరు కాని కృష్ణారెడ్డి పంచన చేరిన నలుగురు డైరెక్టర్లు మరో సమావేశం పెట్టుకుని కొత్త బోర్డును ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఈ వైనాన్ని చూసిన ఆసుపత్సి నిజమైన బోర్డు… అసలు విషయాన్ని బయటపెట్టింది. ఆసుపత్రిని హస్తగతం చేసుకునేందుకు ఇప్పటిదాకా జరిగిన యత్నాలను మీడియా ముందు విప్పి చెప్పింది. ఆసుపత్రిని చేజిక్కించుకునేందుకు తమను కృష్ణారెడ్డి ఏ రీతిన బెదిరింపులకు దిగిన వైనాన్ని విప్పి చెప్పింది. అయితే ఈ విషయంలో ఆసుపత్రిని పరిరక్షించుకునేందుకు ఎంతదాకా అయినా వెళతామని, కృష్ణారెడ్డి ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తామని బోర్డు సంచలన ప్రకటన చేసింది. తాజా పరిణామాలతో ఆసుపత్రి భవితవ్యం ఎలా మారుతుందోనన్న ఆందోళన మొదలైంది.
Must Read ;- కేసీఆర్ కామెంట్!.. వైఎస్సార్ ను మించిన మూర్ఖుడు జగన్











