వ్యాపార సంస్థలు పండుగలకు ఆఫర్లు ప్రకటించడం చూశాం. కానీ ఇక్కడ ఏకంగా ప్రజా రవాణా వ్యవస్థనే పండగకు సంబంధించిన ఆఫర్ను ప్రకటించింది. బతుకమ్మ పండగ, దసరా పండగ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ను ప్రకటించింది.
కరోనా తెచ్చిన తంటా అంతాఇంతా కాదు. అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. ప్రజా రవాణాకు కూడా బ్రేక్పడిన విషయం తెలిసిందే. రైల్వే సేవలు, మెట్రో రైళ్లు, బస్సు సేవలు స్తంభించిపోయిన విషయం మనకు తెలుసు. అయితే లాక్డౌన్ తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా బస్సు, రైల్వే, మెట్రో సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు కూడా దశలవారీగా ప్రారంభమయ్యాయి. అయితే గతంలో మాదిరిగా ఆ స్థాయిలో మెట్రో సేవలను నగరవాసులు వినియోగించట్లేదు. అంతకుముందు ఒక్కో కారిడార్లో దాదాపు 50 వేల నుంచి లక్ష మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకునేవారు. కానీ కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పడు మూడు కారిడార్లలో కలిపి సరిగ్గా లక్ష మంది కూడా దాటడం లేదు. ప్రయాణికులను పెంచుకునే పనిలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఈ దసరాకు ప్రయాణికుల కోసం కొన్ని ఆఫర్లను ముందుకు తెచ్చింది.
ఆఫర్స్ ఇలా..
ప్రయాణికుల ఛార్జీల్లో మెట్రో రాయితీలు ప్రకటించింది. సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం వరకు రాయితీని ఇస్తున్నట్లు పేర్కొన్నది. అయితే ఈ రాయితీ మాత్రం అక్టోబర్ 17 నుంచి 31 వరకు వర్తించనుంది. స్మార్ట్ కార్డుతో 14 ట్రిప్పుల ఛార్జీతో 20 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని మెట్రో కల్పిస్తుంది. అలాగే 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు, 20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం ఇస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది.
టీ సవారీ యాప్ ద్వారా నవంబర్ 1 నుంచి ఆఫర్ ఇలా ఉండనుంది.
7 ట్రిప్పుల ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం. 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 20 ట్రిప్పులు.20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులు. 30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 ట్రిప్పులు. 40 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని మెట్రో ప్రకటించింది.
కరోనాతో 900 కోట్లు నష్టం…
కరోనాతో మెట్రో సేవలు దాదాపు 6 నెలల వరకు నిలిచిపోయాయి. దీంతో రూ.900 కోట్ల ఆదాయం మెట్రో సంస్థకు వాటిల్లిందని ఎల్అండ్టి మెట్రో రైల్ సంస్థ ఎండి కెవిబి.రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 800 రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. లక్ష మంది వరకు ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. వరదల కారణంగా నగర రోడ్లు దెబ్బతిన్నందున మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. శనివారం నుండి ఈ నెలాఖరు వరకు 40 శాతం రాయితీలు అందిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్.రెడ్డి పేర్కొన్నారు. మెట్రో భద్రతకు ఎలాంటి ముప్పులేదని కూడా మెట్రో సంస్థ స్పష్ట చేసింది.











