ఏపీ సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లో 60 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. కరోనా రెండో వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి సచివాలయానికి వచ్చే జనం తాకిడి బాగా తగ్గింది. నిన్న శుక్రవారం అయితే సచివాలయంలో కనీసం ఉద్యోగులు కూడా కనిపించలేదు. కరోనా భయంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక ఇప్పటికే సచివాలయానికి వస్తున్న 60 ఉద్యోగులకు కరోనా సోకడంతో కలకలం రేగుతోంది. ఇంకా టెస్టులు పెంచితే ఈ సంఖ్య 200 చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచి సోమవారం వచ్చి శుక్రవారం వెళ్లిపోతున్నారు. ఇలా తెలంగాణ నుంచి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఉద్యోగులు సచివాలయానికి రావడం, దీనికి తోడు అనేక పనులపై పలు జిల్లాల నుంచి జనం సచివాలయానికి రావడంతో కరోనా వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది.
కరోనా కట్టడికి చర్యలు..
సచివాలయంలో కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే పలు బ్లాకులను కట్టడి చేశారు. సాధారణ జనాన్ని లోపలకు అనుమతించడం లేదు. దీంతో సచివాలయానికి వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. చాలా అర్జంట్ పని ఉంటే తప్ప సచివాలయానికి రావద్దని అధికారులు విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక సచివాలయంలో లక్షణాలు కనిపించిన ఉద్యోగులందరికీ కోవిడ్ టెస్టులు చేయాలని వైద్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే శని, ఆదివారాలు సెలవు కావడంతో సచివాలయం మూత పడింది. ఇప్పటికే సచివాలయంలో కరోనా నివారణకు అవసరమైన శానిటేషన్ పనులు చేపట్టారు.
Must Read ;- కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్











