అన్ని పార్టీల కంటే ముందే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు తన అభ్యర్థిని ప్రకటించింది టీజేఎస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉండాలా వద్ద అని చివరి వరకు ఎదురు చూసిన కోదండరామ్ ఈ సారి ఓ అడుగు ముందుకు వేశారు. తెలంగాణ జనసమితి కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కూటములు.. పొత్తుల విషయం పక్కన పెట్టి ముందుగా కోదండరామ్ బరిలో ఉంటారని ప్రకటిస్తే తరువాత పరిణామాలను గమనించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీంతో అందరి కంటే ముందుగానే కోదండరామ్ బరిలో ఉంటారంటూ చెబుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా పార్టీ నేతల ఒత్తిడి మేరకు పార్టీ నేతలు , కార్యవర్గ నిర్ణయాన్ని కాదన లేక ఆయన పోటీలో నిలిచారు.
ఆరునెలల ముందే హడావుడి….
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కోదండరామ్ పనులు ప్రారంభించారు. వరంగల్ , ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ అభ్యర్థిగా గోదాలో ఉంటానన్న సంకేతం ముందు నుంచి ఇచ్చిన కోదండరామ్ అందరి కంటే ముందే అభ్యర్థిగా ఖరారయ్యారు.
ముందే లీకులు…అందరితో సంప్రదింపులు.
కోదండరామ్ అభ్యర్థిగా నిలబడుతున్నట్టు ముందు నుంచే పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన అన్ని పార్టీల నేతలను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఇంటి పార్టీ వంటి పార్టీలను కలిశారు. అయితే ఆయన కలిసినా ఏ పార్టీ కూడా సానుకూలంగా స్పందించ లేదు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ ఏకంగా ఆయనే బరి నుంచి తప్పుకోవాలని కోరారు. కోదండరామ్ కు ఎన్నికల్లో మద్దతిచ్చేందుకు ఏ పార్టీ కూడా సానుకూలంగా స్పందించలేదని తేలిపోయింది.
ఈ సారీ టికెట్ దక్కదేమోనని…
గతంలో లాగే ఈ ఎన్నికల్లో కూడా తనకు టికెట్ దక్కకుండా పోతుందేమోనన్న భయం ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. దీంతో టీజేఎస్ అత్యవసరంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. కోదండరామ్ ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయించి ఆయన పేరును ప్రకటించాయి. అతను కూడా ప్రజాపోరాటంలో ముందుండే తను… ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకాడేది లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు కోదండరామ్ భావిస్తున్నారు.
బరిలో దిగేందుకు ఇదే అదును…
ఎన్నికల బరిలో దిగేందుకు సరైన సమయం అని భావించిన కోదండరామ్… గ్రాడ్యుయేట్లు తన వెంట ఉంటారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తన టికెట్ దక్కకున్నా… వివిధ పార్టీల గెలుపు కోసం, మహాకూటమి విజయం కోసం విశ్రాంతి లేకుండా పనిచేశారు .
ఈ ఎమ్మెల్సీలో కలిసి వస్తారనే….
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అన్ని పార్టీలు మద్దతిస్తాయన్న నమ్మకంతోనే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వెనక్కు తగ్గారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే గతంలో ఆయనకు మాట ఇచ్చిన పార్టీలు ఇప్పుడు నోరు మెదపక పోవడంతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. అయితే బయట మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని… ఈ మధ్యలో అన్ని పార్టీలు తనతో కలిసి వస్తాయని.. సంప్రదింపులు కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇంతకూ కోదండరాం ఆశిస్తున్నట్టు అన్ని పార్టీలు పోటీ నుంచి తప్పుకుని మద్దతునిస్తాయో లేక మరోసారి కోదండరామ్ ను ఏకాకిని చేసి తమ అభ్యర్థులను బరిలో నిలుపుతాయో చూడాలి.











