(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గతంలో లేని విధంగా ఉత్తరాంధ్రను గజగజ వణికిస్తోంది. శ్రీకాకుళంలో కేసులు రోజురోజుకూ వేలసంఖ్య దాటుతుండటంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గంటకు 411మందికి
రాష్ట్రంలో గంటకు సగటున 411 మంది వైరస్ బారిన పడుతుండగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడచిన ఐదు రోజుల్లోనే (ఏప్రిల్ 22-26) 56,738 కేసులొచ్చాయి. ఈ నెల మొదట్లో 50 వేల కేసులు నమోదయ్యేందుకు 17 రోజుల(1-17) సమయం పట్టింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 9,881 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మహమ్మారి బారిన పడిన వారిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురేసి, గుంటూరు, కడప, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి, ప్రకాశంలో ఇద్దరు మరణించారు.
13.34 శాతం మందికి ..
రాష్ట్రవ్యాప్తంగా 74,041 నమూనాల్ని పరీక్షించగా 13.34 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తం కేసులు 10,43,441కు, మరణాలు 7,736కు చేరాయి. నెల్లూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో తాజాగా వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కిందటి రోజు(12,634 కేసులు, 69 మరణాలు)తో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది. మార్చి ఆఖరు వరకూ ఓ మోస్తరుగా నమోదైన కేసులు ఏప్రిల్ 1 నుంచి నెమ్మదిగా పెరిగాయి. 15 తర్వాత ఉద్ధృతమయ్యాయి. క్రియాశీలక కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. ఈనెల 1కి రాష్ట్రంలో 8,142 క్రియాశీలక కేసులుండగా.. సోమవారానికి ఆ సంఖ్య 95,131కు చేరింది. ఈ వ్యవధిలో క్రియాశీలక కేసుల్లో 1,068.34 శాతం పెరుగుదల నమోదైంది.
ఆ నాలుగింట ఉధృతి ..
రాష్ట్రంలో 24 గంటల్లో నమోదైన కేసుల్లో 4,972 (50.31 శాతం)… నెల్లూరు (1,592), తూర్పుగోదావరి (1,302), గుంటూరు (1,048), విశాఖపట్నం (1,030) జిల్లాల్లోనే వచ్చాయి. పశ్చిమగోదావరి మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 4,431 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 1,60,68,648 నమూనాల్ని పరీక్షించారు.
కంటైన్మెంట్ జోన్‌గా శ్రీకాకుళం..
శ్రీకాకుళం నగరం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. శ్రీకాకుళంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు. మంగళవారం నుంచే ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. జిల్లాలోని మొత్తం కేసుల్లో ముప్పై శాతం కేసులు శ్రీకాకుళం నగరంలోనే నమోదు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న 14 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. తొలి విడతలో కూడా పోలీసు శాఖ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసింది. గడిచిన రెండు రోజులుగా రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కరోనా తీవ్రత ఉన్న నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలపై దృష్టి సారించి రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీలు, డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ గస్తీని పరిశీలిస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. మాస్కులు లేకుండా ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ నగరంలోని ప్రధాన కూడళ్లలో రాత్రివేళ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం నుంచి మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
Must Read ;- కరోనాపై ‘సీతక్క’ పోరు : కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష