టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 16న మైలవరం అయ్యప్పనగర్‌లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను దేవినేని పరిశీలించారు. తన వెంట ఎక్కువ మందిని తీసుకెళ్లి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అభియోగం మోపారు. బుధవారం దేవినేని ఉమపై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. అయ్యప్పనగర్‌లో పేదలకు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రెండు సెంట్లు భూమి ఇచ్చిందని, దాన్ని ప్రభుత్వం తీసుకుని ఒక్కో కుటుంబానికి సెంటున్నర ఇవ్వడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు ఎలా గుంజుకుంటారని దేవినేని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎప్పుడో ఇచ్చిన భూములను తీసుకుని వాటిని వేరే వారికి ఇచ్చి పేదల మధ్య తగాదాలు పెడుతున్నారని దేవినేని ధ్వజమెత్తారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన అన్నారు. దేవినేని ఉమ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం వల్లే అక్రమ కేసులు పెడుతున్నారని మైలవరం టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
Must Read ;- పోలవరం పనులు పడకేశాయి: దేవినేని ఉమ