అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.జూన్1 కల్లా కౌంటర్ దాఖలు చేయపోతే,నేరుగా విచారణ ప్రారంభిస్తామని న్యాయస్థానం హెచ్చరించడంతో,జగన్ తరఫు న్యాయవాదులు ఇవాళ 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.ఇందులో జగన్ ఎక్కడా బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.జగన్ సీబీఐని,సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే దానిలో నిజం లేదని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు.సీబీఐ కేంద్ర హోం శాఖ పరిధిలో పని చేస్తుందని వారు గుర్తు చేశారు.జగన్ బెయిల్ రద్దు చేయమని కోరే హక్కు ఎంపీ రఘురామరాజుకు లేదని వాదించారు. కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను జగన్ తరఫు న్యాయవాదులు ఉటంకించారు.మరో వైపు ఈ విషయాన్ని కోర్టు నిర్ణయానికే వదిలివేస్తున్నట్లు సీబీఐ నోట్ సమర్పించింది.
ఆయనపై అనేక కేసులున్నాయి
జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఎంపీ రఘురామరాజుపై అనేక కేసులు కూడా ఉన్నాయని,పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని,ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌కు సమర్పించిన లేఖను కూడా కౌంటర్‌లో జత చేశారు.ఎంపీ రఘురామరాజుపై ఆచంట,నరసాపురం,పెనుగొండ,పెనుమంట్ర,బీమవరం పోలీస్ స్టేషన్లలో అనేక కేసులున్నాయని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఎంపీ రఘురామరాజు బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టడంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టులను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేశారు.
Must Read ;- అందరికీ ధన్యవాదాలు,న్యాయమే గెలుస్తుంది: రఘురామరాజు