నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురాకృష్ణరాజుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసింది. పేరుకు షరుతలతో కూడిన బెయిలే అయినప్పటికీ…జగన్ సర్కారు ఇదివరకటిలా రఘురామరాజును ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేయడం,వేధించడం ఇక కుదరదు.అంటే…నైతికంగా జగన్ సర్కారుపై రఘురామరాజు విజయం సాధించినట్లే లెక్క. ఇదంతా బాగానే ఉన్నా… ఈ వ్యవహారంలో జగన్ సర్కారు పరువు నిజంగానే గంగలో కలిసిపోయిందని చెప్పక తప్పదు.ఎందుకంటే…జగన్ సర్కారు ఎదుర్కొంటున్న పలు కీలక కేసుల్లో జగన్ సర్కారు తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలతోనే…జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్న రఘురామరాజుకు బెయల్ దక్కింది.అంటే… జగన్ లాయరే జగన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న రఘురామరాజుకు బెయిల్ ఇప్పించారన్న మాట.
వారి బంధం పరిశీలిస్తే..
జగన్ సర్కారుకు ముకుల్ రోహత్గీకి మధ్య కొనసాగుతున్న బంధం గురించి ఓ సారి పరిశీలిస్తే….నవ్యాంధ్ర నూతన రాజధానిగా చంద్రబాబు సర్కారు ఎంపిక చేసిన అమరావతి విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసున్నాయని, అందులో చంద్రబాబు ప్రత్యక్ష పాత్రతో పాటు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారి పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని, వారిలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని జగన్ ప్రకటించారు.అది కూడా ఏపీ సీఎంగా తాను పదవీ ప్రమాణం చేసిన వేదిక మీద నుంచే జగన్ సంచలన ప్రకటన చేశారు.ఈ కేసు హైకోర్టును దాటేసి సుప్రీంకోర్టు గడప తొక్కింది.సుప్రీంకోర్టులో తమ తరఫున వాదనలు వినిపించేందుకు ముకుల్ రోహత్గీని జగన్ సర్కారు నియమించుకుంది.ఇందుకోసం రోహత్గీకి ఏకంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు జగన్ సర్కారు ఒప్పందం చేసుకుంది.ఈ లెక్కన జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వ్యవహారంలో జగన్ వాదనలు వినిపించే కీలక బాధ్యతలను రోహత్గీనే భుజానికెత్తుకున్నారు.
ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ కేసులోనూ..
ఇక విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించిన కేసులోనూ జగన్ సర్కారు తరఫున సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీనే వాదనలు వినిపిస్తున్నారు.ఎల్జీ పాలీమర్స్ ఘటనలో చనిపోయినవారికి ఏకంగా రూ.1 కోటి మేర పరిహారాన్ని జగన్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ కేసు ద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయంగానూ తన పరపతిని పెంచుకునేందుకు జగన్ సర్కారు తనదైన శైలి యత్నాలు చేసిందనే చెప్పాలి.ఇంత ప్రాధాన్యం ఉన్నందునే జగన్ సర్కారు ఆర్గ్యూమెంట్లలో తనదైన సత్తా చాటుతున్న రోహత్గీని ఎంచుకుంది.ఈ లెక్కన ముకుల్ రోహత్గీ…జగన్ సర్కారుకు ఆస్థాన న్యాయవాదిగానే చెప్పాలి.మరి అలాంటి రోహత్గీ ఒక్కసారిగా జగన్ సర్కారు అత్యంత కీలకంగా భావించిన రఘురామరాజు కేసులో… జగన్ సర్కారుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడం,ఏకంగా రఘురామరాజుకు బెయిల్ దక్కేలా వాదనలు వినిపించడం నిజంగానే ఆసక్తి కలిగించేదే కదా. అంతేనా… జగన్ సర్కారు ఎంపిక చేసుకున్న లాయర్ చేతిలోనే జగన్ సర్కారే ఓడిపోయిందన్న వాదనలు ఢిల్లీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చాక మారిన మాట..
గడచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 25 మంది ఎంపీలను గెలిపిస్తే… కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని బల్ల గుద్ది మరీ చెప్పిన జగన్…ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే మాట మార్చేశారు.కేంద్రంలో రెండో పర్యాయం అధికారం చేజిక్కించుకున్న మోదీ సర్కారు సంపూర్ణ మెజారిటీని సాధించిందని…23 మంది ఎంపీలతో మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కూడా తనదైన శైలిలో మడమ తిప్పేశారు.అంతేకాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం,పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల,ఇతరత్రా సమస్యల పరిష్కారం విషయంలో జగన్ విఫలమయ్యారనే చెప్పాలి.ఇక మోదీ, అమిత్ షా వంటి నేతల అపాయింట్‌మెంట్ల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్న జగన్… ఢిల్లీ సర్కిల్స్ లో బాగానే పలచనబడిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఇలాంటి క్రమంలో కోట్లకు కోట్ల మేర ప్రజాధనాన్ని వెచ్చించి మరీ నియమించుకున్న న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలతో జగన్ ప్రత్యర్థిగా ముద్రపడిపోయిన రఘురామరాజుకు బెయిల్ రావడంతో హస్తిన వర్గాల్లో జగన్ మరింత పలచనబడిపోయారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.