ట్రాన్స్‌ట్రాయ్ ప్రమోటర్ ఛైర్మన్, డైరక్టర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఉదయమే వచ్చిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీకి ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించకపోవడం, ప్రాజెక్టుల కోసం మంజూరు చేసిన నిధులను ఇతర ఖాతాలకు మళ్లించడం, ఆర్థిక లావాదేవీల్లో లొసుగులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా గత ఏడాది డిసెంబరు 31న కూడా రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు జరిగాయి. హైదరాబాద్, గుంటూరులో ఆయన ఇళ్లలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన సీబీఐ తాజాగా రెండోసారి సోదాలు చేస్తోంది.
నాలుగుసార్లు గెలిచి..
రాయపాటి ఉమ్మడి ఏపీలో, ప్రస్తుత ఏపీలోనూ గుంటూరు, నర్సరావుపేట నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఒకసారి రాజ్యసభకూ ఎన్నికయ్యారు. 2014లో టీడీపీలో చేరారు. నర్సరావుపేట నుంచి ఎంపీగా గెలుపొందారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన కుమారుడైన రంగారావుకి సత్తెనపల్లి టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలం కావడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే రాయపాటికి గతం నుంచీ అదే జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి, బీజేపీలో అప్పటికే కీలకంగా ఉన్న కన్నా లక్ష్మినారాయణతో తీవ్ర విభేధాలున్నాయి. కన్నా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాయపాటిని బీజేపీలోకి రాకుండా అడ్డుకున్నారన్న చర్చ అప్పట్లోనే నడిచింది.
కంపెనీ విషయానికి వస్తే..
2013లో భారీగా రుణాలు పొందిన ట్రాన్స్‌టాయ్ తరువాత కాలంలో వాటిని సకాలంలో చెల్లించడం లేదని బ్యాంకులు ఆ కంపెనీ ఆస్తుల వేలానికి కూడా సిద్ధమయ్యాయి. మొత్తం 14కంపెనీల వద్ద రూ. 8,800కోట్ల రుణాలు పొందింది. రాష్ట్ర విభజనకు ముందే రూ.4,717 కోట్ల విలువైన పోలవరం హెడ్ రెగ్యూలెటరీ పనులను కూడా దక్కించుకుంది. అదే టైంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కుమరం భీమ్ ప్రాజెక్టు, అనంతపురంలోని చాగల్లు బ్యారేజ్‌ల పనులు, హైదరాబాద్ ORR ఫేస్ -1 పనులతో పాటు యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడులో పలు ప్రాజెక్టులను చేపట్టిన ఈ కంపెనీ కొన్నింటిని పూర్తి చేసింది. తరువాత ట్రాన్స్‌ట్రాయ్ రుణాలను తిరిగి చెల్లించడం నిలిపివేసింది. ఈ రుణాలకు గాను లీడ్ బ్యాంకుగా ఉన్న కెనరా బ్యాంకు రూ.990 కోట్లు రుణం ఇవ్వగా తరువాత చెల్లింపులో జాప్యం కారణంగా ట్రాన్స్‌ట్రాయ్‌ని బ్యాంకులు ఎన్‌పీఏ జాబితాలో చేర్చాయి. యూనియన్ బ్యాంకు కూడా రూ.264కోట్ల రుణానికి సంబంధించి సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో చేరడమేనా..
ఇక రాజకీయ చర్చల విషయానికి వస్తే.. కొన్నాళ్లుగా రాయపాటి బీజేపీలో చేరతారన్న ప్రచారం ఉన్నా.. చేరలేదు. ఇందుకు బీజేపీలోనే ఉన్న కన్నా లక్ష్మినారాయణ కారణం అన్న చర్చ జరిగింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నారు. దీంతో ఆయనకు లైన్ క్లియర్ అయినా..వేచి చూసే దోరణిలో ఉన్నట్లు బీజేపీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సోదాల నేపథ్యంలో బీజేపీకి ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమ వుతోంది. ఎందుకంటే.. గతంలో టీడీపీకి చెందిన కొందరు ఎంపీలపైనా ఈడీ, సీబీఐ సోదాలు జరిగాయి తరువాత కొన్ని రోజులకే వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాయపాటిపై సీబీఐ సోదాలు రాజకీయంగా ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీ వైపు చూడడం కంటే..బీజేపీవైపు తిప్పుకోవడం ఇప్పుడు ఏపీలో బీజేపీకి అత్యవసరం. అయితే, ప్రస్తుతం రాజకీయాల్లో రాయపాటి అంత క్రియాశీలకంగా లేకపోయినా రాజకీయంగా ఒక మెస్సేజ్ మాత్రం వెళ్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాయపాటిపై సీబీఐ దాడులు చర్చనీయాంశమయ్యాయి.